ఆటో పరిశ్రమకు తొలగిపోని సవాళ్లు

Siam Report: Hurdles In Automobile Sector In India - Sakshi

4శాతం తగ్గిన ప్యాసింజర్‌ 

వాహన అమ్మకాలు: సియామ్‌  

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమ సరఫరా వైపు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరా 4 శాతం తక్కువగా ఏప్రిల్‌లో నమోదైంది. పరిశ్రమకు సరఫరా వైపు సవాళ్లు నెలకొని ఉన్నట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. ఏప్రిల్‌లో దేశీయ హోల్‌సేల్‌ ప్యాసింజర్‌ హోల్‌సేల్‌ వాహన విక్రయాలు 2,51,581 యూనిట్లుగా ఉంటే, అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2,61,633 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు గత నెలలో 1,12,857 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 1,41,194 యూనిట్లుగా ఉండడం గమనించాలి. యుటిలిటీ వాహన హోల్‌సేల్‌ విక్రయాలు 1,27,213 యూనిట్లు, వ్యాన్‌ డిస్పాచ్‌లు 11,568 యూనిట్లుగా ఉన్నాయి.  

ద్విచక్ర వాహనాల్లో వృద్ధి 
ప్యాసింజర్‌ వాహనాలకు భిన్నంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏప్రిల్‌లో పెరిగాయి. 15 శాతం అధికంగా 11,48,696 వాహనాలు ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు సరఫరా అయ్యాయి. 2021 ఏప్రిల్‌లో ఇవి 9,95,115 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఇందులో మోటారుసైకిళ్ల అమ్మకాలు 6,67,859 యూనిట్ల నుంచి 7,35,360 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల డిస్పాచ్‌లు 3,01,279 యూనిట్ల నుంచి 3,74,556 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 20,938 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో తిచక్ర వాహన అమ్మకాలు 13,856 యూనిట్లుగా ఉన్నాయి. 

2017 కంటే తక్కువే..  
‘‘ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు ఇప్పటికీ 2017 ఏప్రిల్‌ నెల గణాంకాల కంటే తక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 2012 ఏప్రిల్‌ నెల కంటే తక్కువగా ఉన్నాయి’’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ తెలిపారు. తిచక్ర వాహనాల విక్రయాలు సాధారణ స్థాయికి చేరుకోవాల్సి ఉందని, 2016 ఏప్రిల్‌లో నమోదైన గణాంకాల కంటే ఇంకా 50 శాతం తక్కువగా ఉన్నట్టు చెప్పారు. సరఫరా వైపు సమస్యలు ఉన్నా.. అధిగమించేందుకు శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల రెపో రేటు పెంపుతో రుణ రేట్లు పెరగనున్నాయని, డిమాండ్‌పై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని రాజేష్‌ మీనన్‌ తెలిపారు.    

చదవండి: జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌కు భారీ షాక్‌, బెడిసి కొట్టిన మాస్టర్‌ ప్లాన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top