భళిరా భళి-  మార్కెట్ల కొత్త రికార్డ్స్

Sensex, Nifty hits new record highs  - Sakshi

చరిత్రాత్మక గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ

కోవిడ్-19 షాక్ నుంచి 7 నెలల్లోనే సూపర్ ర్యాలీ

553 పాయింట్ల హైజంప్- 42,446కు సెన్సెక్స్

157 పాయింట్లు ప్లస్-12,420 వద్ద నిఫ్టీ ట్రేడింగ్

ఇంట్రాడేలో 12,436కు నిఫ్టీ- 42,566కు సెన్సెక్స్ 

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 20న సాధించిన లైఫ్ టైమ్ హైలను రెండు ఇండెక్సులూ తిరిగి ఒకే రోజు అధిగమించడం విశేషం.  కోవిడ్-19 ఇచ్చిన షాక్ నుంచి కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సూపర్ ర్యాలీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ తొలుత 673 పాయింట్లు దూసుకెళ్లింది 42,566ను తాకింది. నిఫ్టీ సైతం 173 పాయింట్లు ఎగసి 12,436కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంతక్రితం ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 వద్ద ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 12,420 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 42,446 వద్ద కదులుతోంది.

కారణలేవిటంటే?
డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ ప్రెసిడెంట్ కానుండటం, ఫెడరల్‌ రిజర్వ్‌, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తదితర కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు మద్దతిస్తుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధాని మోడీతో బైడెన్ కు సత్సంబంధాలుండటం, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం సైతం ఇందుకు దోహదం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల తొలి ఐదు రోజుల్లోనే ఎఫ్ఐఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.8-1.7 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, యాక్సిస్, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్యూఎల్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం కోల్ ఇండియా అదికూడా 0.25 శాతం నీరసించింది.

బంధన్ జూమ్
డెరివేటివ్స్‌లో బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, ఇండిగో, మైండ్ ట్రీ, మదర్ సన్, కోఫోర్జ్, మారికో, బీఈఎల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్ఎం సీపీ  3.5-1.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. గ్లెన్ మార్క్ 5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అశోక్ లేలాండ్, సెయిల్, మణప్పురం, శ్రీరాం ట్రాన్స్, బాష్, టొరంట్ పవర్, హావెల్స్, పీవీఆర్‌ 1.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,296 లాభపడగా.. 491 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top