సెన్సెక్స్‌.. రోలర్‌ కోస్టర్‌; +416 నుంచి –545కు.. | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌.. రోలర్‌ కోస్టర్‌; +416 నుంచి –545కు..

Published Tue, Dec 14 2021 1:21 AM

Sensex ends 500 points lower, Nifty below 17400 - Sakshi

ముంబై: కీలక ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటనకు ముందు స్టాక్‌ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. అమెరికాతో సహా ఇదే వారంలో పలుదేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ సమీక్ష సమావేశాల నేప థ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. అలాగే ఒమిక్రాన్‌ భయాలు,  విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

ఈ పరిణామాలతో మార్కెట్‌ సోమవారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్‌ 503 పాయింట్లు నష్టపోయి 58,283 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17,368 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఒక ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తి డిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2743 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1351 కోట్ల షేర్లను కొన్నారు.  ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  

గరిష్టం నుంచి 960 పాయింట్ల పతనం
సెన్సెక్స్‌ ఉదయం 317 పాయింట్ల లాభంతో 59,104 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 17,619 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 416 పాయింట్లు పెరిగి 59,203 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు ర్యాలీ చేసి 17,511 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్‌లోనూ యూరప్‌ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో  సెన్సెక్స్‌  గత ముగింçపుతో పోలిస్తే 545 పాయింట్లు కోల్పోయింది.  వెరసి ఇంట్రాడే గరిష్టం(59,203) నుంచి 960 పాయింట్లు పతనమై 58,243కు చేరింది.

అమ్మకాలు ఎందుకంటే...?

► అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌తో పాటు ఈ వారంలో యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌(ఈసీబీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌లు పరపతి సమీక్ష గణాంకాలు వెల్లడి కానున్నాయి. వడ్డీరేట్లు, బాండ్ల క్రయ, విక్రయాలు, ద్రవ్యవిధానంపై ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ వైఖరిని ప్రకటించనున్నాయి. ఇప్పటికే యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి వచ్చాయి.

► ఒమిక్రాన్‌ వేరియంట్‌ కట్టడికి కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతతో సప్లై చైన్‌ దెబ్బతింది. ఫలితంగా అమెరికా నవంబర్‌ ద్రవ్యోల్బణం 39 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. దేశీయంగానూ ఇవే కారణాలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపునకు మొగ్గుచూపాయనే సంగతి తెలిసిందే.  

► బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైనట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. కట్టడి చర్యలను మరింత కఠినం చేస్తే ఆర్థిక రికవరీ ఆగిపోవచ్చని ఆందోళనలు మార్కెట్‌ వర్గాలను కలవరపెట్టాయి.

► విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. ఈ డిసెంబర్‌లో ఇప్పటి వరకు రూ.8,879 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ.7,462 కోట్ల ఈక్విటీ మార్కెట్‌ నుంచి, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.1,272 కోట్లు, హైబ్రిడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.145 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.


రూ. లక్ష కోట్ల సంపద మాయం
సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోవడంతో రూ. లక్ష కోట్ల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.266 లక్షల కోట్లకు దిగివచ్చింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 523 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లను కోల్పోయాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు

► పేటిఎం యాప్‌ ద్వారా గత రెండు నెలల్లో వర్తకులకు చేసిన మొత్తం చెల్లింపుల విలువ(జీఎంవీ) రెట్టింపు అయినప్పటికీ.., పేటీఎం షేరు 1% నష్టపోయి రూ.1555 వద్ద స్థిరపడింది.  

► బోర్డు సమావేశానికి ముందుకు ఈజీమైట్రిప్‌ షేరు పదిశాతం ర్యాలీ చేసి రూ.1039 వద్ద ముగిసింది.  

► ఎంకే బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినా., స్టార్‌ హెల్త్‌ షేరు ఒకశాతం క్షీణించి రూ.897 వద్ద నిలిచింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement