మళ్లీ రికార్డుల పరుగు..!

Sensex and Nifty Gain For Second Straight Session Led By IT Pharma Stocks - Sakshi

మరోసారి జీవితకాల గరిష్టస్థాయిల నమోదు 

ఉత్సాహాన్నిచ్చిన వ్యాక్సిన్ల విజయవంతం వార్తలు

రాణించిన ఐటీ, ఫార్మా, మెటల్‌ షేర్లు

ర్యాలీకి దన్నుగా నిలిచిన రిలయన్స్‌ షేరు

అమ్మకాల ఒత్తిడికి లోనైన బ్యాంకింగ్‌ షేర్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ రికార్డుల బాటపట్టింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 195 పాయింట్లు పెరిగి 44 వేల పైన 44,077 వద్ద స్థిరపడింది. నిప్టీ 67 పాయింట్లను ఆర్జించి 12900 ఎగువున 12,926 వద్ద నిలిచింది. కోవిడ్‌–19 కట్టడికి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ట్రయల్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయనే వార్తలు ఈక్విటీలకు ఉత్సాహాన్నిచ్చాయి.

తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన వ్యాక్సిన్‌ సైతం తుది దశలో మెరుగైన ఫలితాలనిచ్చింది. అలాగే రిలయన్స్‌ – ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌కు సీసీఐ ఆమోదం తెలపడంతో రిలయన్స్‌ షేరు 3 శాతం లాభపడి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. డాలర్‌ మారకంలో రూపాయి రివకరీ కలిసొచ్చింది. మార్కెట్‌లో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్ల భాగంగా చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.25% లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 389 పాయింట్లు ఎగసి 44,271 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 12,969 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి.

బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు...  
ప్రైవేట్‌ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదనతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 2.50 శాతం నుంచి 1% నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1% పతనమైంది.

3 శాతం లాభపడ్డ రిలయన్స్‌ షేరు...  
ఆర్‌ఐఎల్‌–ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలపడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 3 శాతం లాభపడి రూ.1,951 వద్ద ముగిసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను కొనుగోలు చేయాలన్న రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ ప్రతిపాదనకు శుక్రవారం సీఐఐ ఆమోదం తెలిపింది.  ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఆర్‌ఐఎల్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించండంతో  షేరు ఇంట్రాడేలో 4 శాతం ఎగసి రూ.1,970 స్థాయిని అందుకుంది. కంపెనీ మార్కెట్‌ వాల్యుయేషన్‌ రూ.34,892 కోట్లు పెరిగి రూ.13.19 లక్షల కోట్లకు చేరుకుంది.  

ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లలోనూ కొనుగోళ్లే...
రూ.24,173 కోట్ల ఆర్‌ఐఎల్‌–ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌కు సీఐఐ అనుమతులు లభించడంతో కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు  పరుగులు పెట్టాయి. రిటైల్‌ ఫ్యూచర్‌ 10% లాభపడి రూ.70 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ షేరు 10% ఎగిసి రూ.90.30 స్థాయిని తాకింది. ఫ్యూచర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ షేరు ఇంట్రాడేలో 5% ర్యాలీతో రూ.10.45 స్థాయిని అందుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top