సాంకేతిక విప్లవం ఆటోమొబైల్ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. కొంతకాలం క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చాలిత) కార్లు ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. టెస్లా, వేమో, క్రూయిజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు పలు భారతీయ స్టార్టప్‌లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, స్టీరింగ్ డ్రైవర్ చేతిలో లేకుండా కార్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో మెదులుతున్నాయి.
బాధ్యత ఎవరిది? డ్రైవర్‌దా లేక సాఫ్ట్‌వేర్‌దా?
సాధారణ కార్ల ప్రమాదాల్లో మానవ తప్పిదం (హ్యుమన్ ఎర్రర్) ప్రధాన కారణం కాబట్టి డ్రైవర్‌పై బాధ్యత ఉంటుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో విషయం వేరు. ఇక్కడ ప్రమాద బాధ్యతను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.
1. లెవల్ 2, 3 (సెమీ-అటానమస్): ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ హెచ్చరించినా డ్రైవర్ స్పందించకుంటే బాధ్యత డ్రైవర్‌దే అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాత పద్ధతిలోనే జరుగుతుంది.
2. లెవల్ 4, 5 (ఫుల్లీ-అటానమస్): ఇక్కడ కారు పూర్తిగా సాఫ్ట్‌వేర్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే అది ‘ప్రొడక్ట్ లయబిలిటీ’ కిందకు వస్తుంది. అంటే తయారీ కంపెనీ లేదా సాఫ్ట్‌వేర్ డెవలపర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధానం
సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అటానమస్ కారులో సెన్సార్లు, కెమెరాల డేటా రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు మాన్యువల్ మోడ్‌లో ఉందా లేక అటానమస్ మోడ్‌లో ఉందా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా తనిఖీ చేస్తాయి.
ఒకవేళ కారు సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల లేదా అల్గారిథమ్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ సదరు కార్ల తయారీ సంస్థ నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేస్తుంది. దీనినే ‘సబ్రోగేషన్’ అంటారు.
బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఉన్న ‘థర్డ్ పార్టీ లయబిలిటీ’ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, పరిహారం చెల్లించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తయారీదారుడిపై కేసు వేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత కంపెనీల విధానాలు
సైబర్ ఇన్సూరెన్స్.. కారు హ్యాకింగ్‌కు గురై ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది.
అల్గారిథమ్ లయబిలిటీ.. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో లోపాల వల్ల జరిగే నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించేలా కొత్త క్లాజులు వస్తున్నాయి.
టెస్లా ఇన్సూరెన్స్.. టెస్లా వంటి కంపెనీలు స్వయంగా ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. డ్రైవర్ ‘సేఫ్టీ స్కోర్’ ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి.
భారత్‌లో పరిస్థితి ఏమిటి?
భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం (ఎంవీఏ) ప్రకారం, వాహనానికి డ్రైవర్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతానికి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మన రోడ్లపై అనుమతి లేదు. అయితే, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) ఉన్న కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగితే ప్రస్తుతానికి డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తూ క్లెయిమ్‌లు సెటిల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!


