SBI Ecowrap: రెపో రేటు పెరిగే అవకాశం.. ఎంతంటే?

SBI Ecrowrap Estimated RBI May be Increased Repo rate of One by fourth - Sakshi

2వ ద్వైమాసిక సమావేశంలో పావుశాతం రెపో పెంపు!  ఎస్‌బీఐ ఎకోర్యాప్‌ అంచనా  

ముంబై: ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4 శాతం) పావుశాతం పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎకోర్యాప్‌ అంచనావేసింది. జూన్‌లో జరిగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా  వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది.  అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రేటింగ్‌ సంస్థ ఇక్రా కూడా జూన్‌ త్రైమాసికంలో రేట్లు పెంపు తప్పకపోవచ్చని ఇప్పటికే అంచనా వేసింది. తాజాగా ఎస్‌బీ ఎకోవ్రాప్‌ అంచనాలను క్లుప్లంగా పరిశీలిస్తే... 

► జూన్, ఆగస్టు నెలల్లో పావుశాతం చొప్పున రేట్లు పెరుగుతాయని భావిస్తున్నాం. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ముప్పావుశాతం వడ్డీరేటు పెరిగే అవకాశం ఉంది.  

► రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్‌ నుండి చికెన్‌ ఫీడ్‌ దిగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి చికెన్‌ ధరలను అమాంతం పెంచేసింది. ఉక్రెయిన్‌ నుండి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇది ఇండోనేíÙయా నుండి ఎగుమతి విధానంలో మార్పులకు దారితీసింది. పామాయిల్‌ దిగుమతులు గణనీయంగా తగ్గాయి.  

► టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం భారీ అంతరం ఏర్పడింది.  రిటైల్‌ ఆహార ధరల కంటే టోకు ఆహార ధరలు ఎక్కువగా ఉన్నాయి. 2022 జనవరి ఈ వ్యత్యాసం  4.7 శాతంగా ఉంటే, ఇప్పుడు ఇది 2.3 శాతానికి తగ్గింది. ధరల నియంత్రణలో వైఫల్యాన్ని గణాంకాలు చూపుతున్నాయి. 

► చమురు ధర బేరల్‌కు 100 డాలర్ల ప్రాతిపదికన 2022–23లో వినియోగ ధరల సూచీ 6 శాతం నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉంటుదని భావిస్తున్నాం. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలనూ ఈ నెల మొదటి వారం ఆర్‌బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది.  

► కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)నూ తీసుకుంటే, ఈ విభాగంలో ఒక శాతం పెరుగుదల వినియోగ ద్రవ్యోల్బణంలో నాలుగు బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) దారితీస్తుంది. 2022–23లో మా సగటు ద్రవ్యోల్బణం క్రితం అంచనా 5.8 శాతం. ఎంసీఎం పెరుగుదల ఎఫెక్ట్‌ 48 నుంచి 60 బేసిస్‌ పాయింట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనా 5.7 శాతం కాకుండా, 6 శాతం దాటిపోయే వీలుంది.  

► సెప్టెంబరు వరకు ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  సెప్టెంబర్‌ తర్వాత ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో ఉండవచ్చు.  

► వడ్డీరేట్ల పెరుగులకు సంకేతంగా ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్‌ సెపె్టంబర్‌ నాటికి 7.75 శాతానికి పెరగవచ్చు. అయితే ఈ రేటును 7.5 శాతం వద్ద కట్టడికి ఆర్‌బీఐ అసాధారణ పాలసీ చర్యలు తీసుకునే వీలుంది. 

చదవండి: క్రూడాయిల్ ధరలు అదే స్థాయిలో ఉంటే జీడీపీపై ప్రభావం..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top