Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?

Sandeep Bakhshi CEO of ICICI bank - Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ భక్షి దేశంలో అత్యధికంగా వేతనాలు పొందే బ్యాంకర్లలో ఒకరు. ఐసీఐసీఐ బ్యాంకును సంక్షోభాల నుంచి బయటకు తీసిన ఘనత ఆయనది. ఆయనకు ముందున్న చందా కొచ్చర్ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో రాజీనామా చేయడం తెలిసిందే. 2018లో బ్యాంకు పగ్గాలు చేపట్టిన సందీప్‌ భక్షి.. ఐదేళ్లలోనే మళ్లీ వృద్ధి పథంలోకి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌! 

సందీప్ భక్షి బాధ్యతలు స్వీకరించినప్పుడు బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ రూ. 313.35. అది మార్చి 16 నాడు రూ. 825 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు బ్యాంక్ మేనేజ్‌మెంట్‌పై విశ్వాసం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆయన హయాంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 5.74 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీ పబ్లిక్‌గా ట్రేడ్‌ చేసిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ విలువను  మార్కెట్‌ క్యాప్‌గా వర్ణిస్తారు.

ఇంజినీర్‌ నుంచి బ్యాంకర్‌
సందీప్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల కార్పొరేట్ అనుభవం ఉంది. చండీగఢ్ పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన జంషెడ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 1986లో ఐసీఐసీఐలో చేరిన సందీప్‌భక్షి 2018లో ఆ బ్యాంకుకు ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన బ్యాంక్ హోల్‌టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేశారు. దానికి ముందు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్.

 

సంవత్సర జీతాన్ని వదులుకున్నారు..
2022 ఆర్థిక సంవత్సరంలో సందీప్ భక్షి వార్షిక వేతనం రూ. 7.98 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ. 65 లక్షలు. అయితే సందీప్‌లోని మరో కోణం  అందరినీ ఆకట్టుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆయన 2021 వార్షిక జీతాన్ని ఆయన వదులుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే ఆయన చాలా లోప్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top