పరీక్షల్లో పాసయ్యేదెవరు?  | sakshi special story about Investments in Diagnostics Market | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో పాసయ్యేదెవరు? 

Oct 12 2026 4:40 AM | Updated on Oct 12 2026 4:40 AM

sakshi special story about Investments in Diagnostics Market

ఇన్వెస్టర్లు గమనించాల్సిన ఫస్ట్‌క్లాస్‌ కంపెనీలేంటి?

ఎక్కువ పరీక్షలు చేసినంత మాత్రాన లాభాలొస్తాయా?

పాథాలజీ, రేడియాలజీ... దేంట్లో ఎక్కువ లాభాలున్నాయి?

డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్, మెట్రోపోలిస్‌ దేనికవే ప్రత్యేకం

ఆఫ్‌లైన్‌ సెంటర్లతో మెరుగైన మార్జిన్లు సాధిస్తున్న విజయ

ప్రభుత్వ నెట్‌వర్క్‌తో కలిసి ఎదుగుతున్న క్రిస్నా

తక్కువ ఖర్చులతో టెస్టుల కర్మాగారంగా మారిన థైరోకేర్‌

మరో మూడు ప్రత్యేక కంపెనీలూ ఉన్నాయ్‌

హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌తో పెరిగిన పోటీ... ధరలపై ఒత్తిడి

ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, ఫార్మసీల నుంచి సైతం పోటీ

ఇన్వెస్టర్లు ఈ రిస్కులను గమనిస్తూ మెరుగైన కంపెనీల్ని గుర్తించొచ్చు  

గడిచిన దశాబ్దంలో వైద్య పరీక్షలు తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. ఇపుడు చాలా పరీక్షలకు ఆసుపత్రులో, డయాగ్నస్టిక్‌ సెంటర్లో అవసరం లేదు. ఇంటికే వచ్చి శాంపిల్స్‌ తీసుకుంటారు. కొన్ని పరీక్షలు అక్కకే చేసేస్తున్నారు!!. అంతేకాదు. అనారోగ్యం వస్తేనే పరీక్షలు చేయించుకునే కాలం పోయింది. ఎలాంటి సమస్యలూ లేకున్నా... ప్రతి ఆరు నెలలకో, ఏడాదికో ప్రివెంటివ్‌ చెకప్‌ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  వీటన్నింటి  ఫలితమే... మన డయాగ్నస్టిక్స్‌ మార్కెట్‌ ఇపుడు రూ.లక్ష కోట్లు దాటేసింది. మరి ఈ రంగంలో విన్నర్‌ ఎవరు? చాలా డయాగ్నస్టిక్‌ సెంటర్లు  లిస్టవుతున్న ఈ పరిస్థితుల్లో ఎవరి పనితీరు ఎలా ఉంది? ఇన్వెస్టర్లు ఎలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలి? ఇవన్నీ వివరించేదే ఈ ‘హెల్త్‌కేర్‌ ఎకానమీ పార్ట్‌–3’.


ఓ రక్తం చుక్క... శరీరంలో ఉన్న చాలా సమస్యల్ని చెబుతుంది.  
ఓ ఎంఆర్‌ఐతో... నరాలకు సంబంధించిన సమస్యలుంటే తెలుస్తుంది.  
ఓ బయాప్సీతో కేన్సర్‌ను కనుక్కోవచ్చు.  
ఓ మాలిక్యులర్‌ పరీక్షతో ఇన్ఫెక్షన్‌ స్థాయిని తెలుసుకోవచ్చు.  
ఇదీ... ఆరోగ్య రంగంలో డయాగ్నోస్టిక్స్‌ పోషిస్తున్న పాత్ర. కాకపోతే ఇన్వెస్టర్లు చూడాల్సిన అత్యంత ప్రధానమైన అంశం మరొకటుంది. అది... ఈ రంగం ఏటా 20–24 శాతం పెరుగుతుండటం. మరి ఆ పెరిగే మార్కెట్‌తో లబ్ధి పొందేదెవరు? ఎక్కువ పరీక్షలు చేసేదెవరు? 
గడిచిన ఐదేళ్లలో డయాగ్నోస్టిక్‌ రంగంలో పోటీ విపరీతంగా పెరిగింది. ధరలు ఎక్కడ తక్కువుంటే అక్కడికే జనం వెళుతుండటంతో... పెద్దగా ధరలు పెంచే పరిస్థితి లేదు. దీంతో ఎక్కువ పరీక్షలు చేసేవారికే ఎక్కువ రెవెన్యూ... ఎక్కువ లాభాలు అనే పరిస్థితి ఏర్పడింది. అలాగని ఎక్కువ సెంటర్లు పెడితే లాభాలపై ప్రభావం పడుతోంది. కాబట్టి తక్కువ సెంటర్లతోనో, ఇంటిదగ్గరే శాంపిల్స్‌ తీసుకునే మోడల్‌తోనో ఎక్కువ పరీక్షలు చేసే కంపెనీలే విజేతలుగా నిలవబోతున్నాయి.  

విజయ డయాగ్నస్టిక్స్‌... మార్జిన్లలో ఆధిపత్యం 
ఈ గ్రూపులో ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన కంపెనీ ఇదేనని చెప్పొచ్చు. ఎందుకంటే పాథాలజీపైనే ఫోకస్‌ పెట్టిన డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌ మాదిరి కాకుండా... హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ పాథాలజీ, రేడియోలజీ రెండింట్లోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తోంది. సీటీ, ఎంఆర్‌ఐ, అ్రల్టాసౌండ్, ఎక్స్‌రే, పాథాలజీ వంటివన్నీ ఉన్న ఆల్‌రౌండర్‌గా ఈ సంస్థను చూడొచ్చు.  

నిజానికి రేడియోలజీ వల్ల ఆర్థికాంశాలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే బ్లడ్‌ శాంపిల్‌ను ఒకచోట సేకరించి మరోచోటికి పంపించవచ్చు కానీ... ఎంఆర్‌ఐ కోసం వచ్చిన పేషెంట్‌ను బ్లడ్‌ శాంపిల్‌ మాదిరి రవాణా చేయలేం. రేడియోలజీ పరికరాలు పేషెంట్లకు చేరువలో ఉండాల్సిందే. అప్పుడే ఎక్కువ మంది వస్తారు. కానీ దీనికి పెట్టుబడులూ ఎక్కువే కావాలి. కాకపోతే ఎక్కువ పేషెంట్లొచ్చి వాడకం పెరిగే కొద్దీ ఈ రేడియోలజీ తెచ్చే లాభాలు చాలా ఎక్కువ. ఈ విషయాన్ని విజయ డయాగ్నస్టిక్స్‌ తాజా ఫలితాలు చూసి అర్థం చేసుకోవచ్చు.   ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విజయ రెవెన్యూ ఏకంగా 22.8 శాతం... అంటే రూ.231 కోట్లు పెరిగింది. 

ఎబిటా ఏకంగా 34 శాతం పెరిగి రూ.99 కోట్లకు చేరింది. నికరలాభం కూడా 37.6 శాతం పెరిగి రూ.53 కోట్లకు చేరింది. అన్నిటికన్నా ముఖ్యం... మార్జిన్ల శాతం. ఎబిటా మార్జిన్‌ ఏకంగా 42.7 శాతానికి చేరింది. ఇది గతేడాది 39.1 శాతంగా ఉంది. అంటే... ప్రస్తుతం అన్నిచోట్లా కేంద్రాలున్నాయి. పరికరాలున్నాయి. వీటికి మరింత మంది పేషెంట్లు జతవుతున్నారు. ఇప్పటికే యంత్రాలను కొనుగోలు చేసిన నేపథ్యంలో వాటి వాడకం పెరుగుతోంది. అది లాభాల్ని పెంచుతోంది. నిర్వహణ పరంగా మెరుగైన స్థాయిని సాధించటమంటే ఇదే. పరీక్షా కేంద్రాలను పెంచటం కాదు... వాటిని ఏ స్థాయిలో వాడుతున్నామన్నది ముఖ్యం. విజయ విషయంలో కలిసి వస్తున్నది ఇదే.

థైరోకేర్‌... పరీక్షల కర్మాగారం 
ఈ కంపెనీది వినూత్నమైన మోడల్‌. ఎక్కడికక్కడ వేలాది ల్యాబొరేటరీలతో విస్తరించిన డయాగ్నస్టిక్స్‌ కంపెనీ కాదిది. ప్రధానమైన అన్ని ప్రాంతాల్లోనూ శాంపిల్స్‌ను సేకరించే వేలాది మందితో అనుసంధానమై విస్తరించిన పరీక్షల కర్మాగారమిది. ఆటోమేషన్‌తో పాటు భారీ ఎత్తున ప్రాసెసింగ్‌ చేయగలిగిన సామర్థ్యం ఈ కంపెనీ సొంతం. దీనివల్ల ప్రతి టెస్ట్‌కూ అయ్యే ఖర్చులు తక్కువ. శాంపిల్‌ సేకరణను ఎక్కడికక్కడ ఫ్రాంచైజీ తరహాలో వ్యక్తులకు అప్పగించటమనే కొత్త విధానానికీ శ్రీకారం చుట్టిందీ సంస్థ. ఇవన్నీ కలిసి 2026 మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయాన్ని 18 శాతం పెంచి రూ.196 కోట్లకు చేర్చాయి. ఎబిటా మార్జిన్‌ దాదాపుగా 34 శాతం ఉంది. ఆటోమేషన్‌ కారణంగా సంస్థ ఎక్కువ శాంపిళ్లను ప్రాసెస్‌ చేయగలుగుతోంది. కాకపోతే దీనికి సవాళ్లూ ఉన్నాయి. అందులో ప్రధానమైంది ధరల్లో పోటీ. ఎక్కువ పరీక్షలు చేయగలుగుతోంది కానీ... పోటీ కారణంగా ఎక్కువ ధరల్ని నిర్ణయించలేకపోతోంది. ఇన్వెస్టర్లు ఈ సంస్థ పరీక్షల సంఖ్యతో పాటు ప్రతి టెస్ట్‌కూ వస్తున్న రెవెన్యూను కూడా గమనించాల్సి ఉంటుంది.  

3బి బ్లాక్‌బయో డీఎక్స్‌... 
అన్నీ ఒకలాంటివి కావు... 
డయాగ్నస్టిక్స్‌ రంగం ఎలా మారుతోందో తెలియజేయడానికి 3బీ బయో సరైన ఉదాహరణ. ఎందుకంటే ఇది శాంపిళ్లను సేకరించే సంప్రదాయ కంపెనీ కాదు. మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్, డయాగ్నస్టిక్‌ ఉత్పత్తుల కంపెనీ. కాబట్టి ఎలాంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తోంది? మాలిక్యులర్‌ టెస్టింగ్‌ ఏ స్థాయిలో ఉంది? కిట్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి? టెక్నాలజీ– ఎగుమతులు– ఉత్పత్తుల అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నాయి? అన్నవే ఈ కంపెనీ పనితీరును ముందుకు తీసుకెళతాయన్నది ఇన్వెస్టర్లు గమనించాలి.

క్రిస్నా... ఇదో విభిన్నమైన సంస్థ 
ఈ సంస్థ ప్రత్యేకత పీపీపీ నమూనాయే. ఎందుకంటే పాథాలజీ, రేడియోలజీ సేవలందించడానికిది ప్రభుత్వాలతోను, ప్రభుత్వ ఆసుపత్రులతోను ఒప్పందాలు చేసుకుంది. ప్రత్యేకించి టైర్‌–2, టైర్‌–3 పట్టణాల్లో. దీనివల్ల ఈ సంస్థకు పేషెంట్ల తాకిడి చాలా ఎక్కువ. కానీ ప్రైవేటు మార్కెట్‌ రేట్లతో పోలిస్తే ఇది వసూలు చేసే రేట్లు చాలా తక్కువ. కాబట్టి క్రిస్నా సంస్థ మిగతా కంపెనీలకన్నా ఎక్కువ పరీక్షలు చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రతి పేషెంట్‌పై విజయ డయాగ్నస్టిక్స్‌ మాదిరి లాభాలను మాత్రం ఆర్జించలేదు. అలాగని ఈ కంపెనీకి ఇదేమీ ప్రతికూలత కాదు. కాకపోతే ఈ తక్కువ ధరల వల్ల పరీక్షలు పెరుగుతున్నాయా? పరికరాలను సమర్థంగా వినియోగించగలుగుతున్నారా? కాంట్రాక్టు వ్యవధి దీర్ఘకాలమేనా? నిర్వహణ  సామర్థ్యం ఏ స్థాయిలో ఉంది? వంటివన్నీ చూడాల్సి ఉంటుంది.  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 22 శాతం పెరిగి రూ.236 కోట్లకు చేరుకుంది. కాకపోతే ఎబిటా మార్జిన్‌ 27 నుంచి 25 శాతానికి పడిపోయింది. రాజస్థాన్‌ ప్రాజెక్టుకు సంబంధించి మానవ వనరులు, లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరిగాయని, దీనివల్ల రెవెన్యూ కూడా మున్ముందు పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.  

ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరో విషయమేంటంటే ప్రభుత్వాలు దీర్ఘకాలం కస్టమర్లుగా కొనసాగుతాయి. కానీ బిల్లుల చెల్లింపులు మాత్రం చాలా ఆలస్యంగా ఉంటాయి. తనకు బిల్లులు రావటానికి పడుతున్న కాలం 150 రోజులకు చేరినట్లు క్రిస్నా ఇదివరకు వెల్లడించింది. అంటే చాలా పేమెంట్లు దాదాపు 5 నెలలు ఆలస్యమవుతున్నాయి.  

 డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌... విస్తరణే లక్ష్యం 
పాథాలజీలో సంప్రదాయ హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌కు స్పష్టమైన ఉదాహరణ ఈ కంపెనీ. ఎందుకంటే ప్రతి కలెక్షన్‌ పాయింట్లోనూ అత్యాధునిక ల్యా బ్‌ అవసరం లేదు. స్థానికంగా సేకరించే శాంపిల్‌ను శాటిలైట్‌ లేదా రిఫరెన్స్‌ ల్యాబ్‌కు తరలించి... అక్కడి అత్యాధునిక పరికరాలతో పరీక్ష చేయొచ్చు. శాంపిల్‌ సేకరణ కేంద్రాలను తేలిగ్గా పెంచుకోవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ క ంపెనీ రూ.2,461 కోట్ల ఆదాయాన్ని, దానిపై రూ.696 కోట్ల ఎబిటాను సా« దించింది. అందుకోసం 8.46 కోట్ల శాంపిల్స్‌ను ప్రా సెస్‌ చేసింది. ఈ వేగం అంతకంతకూ పెరుగుతోంది.  

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.798 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 శాతం పెరిగింది. పేషెంట్ల సంఖ్య 8.2 శాతం, శాంపిల్స్‌ 10.7 శాతం, ప్రతి పేషెంట్‌పై వచ్చే ఆదాయం 10 శాతం పెరిగాయి. ఎబిటా రూ.247 కోట్లుగా నమోదైంది. ఈ సంస్థ మార్జిన్లు ఏకంగా 31 శాతానికి చేరాయి. ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఇలాంటి వృద్ధినే. సెంటర్లు పెంచటం, ఎక్కువ పరీక్షలు చేయటానికే పరిమితం కాకుండా రెవెన్యూ, లాభాలపై దృష్టి పెట్టి ముందుకు వెళుతోంది. ఇందుకోసం బ్రాండ్, డాక్టర్లతో సంబంధాలు, కలెక్షన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, లాజిస్టిక్స్, రిఫరెన్స్‌ ల్యాబొరేటరీల పెంపు, మరిన్ని పరీక్షలను చేర్చటంపై ఫోకస్‌ పెట్టింది. వేలకొద్దీ శాంపిళ్లను ప్రాసెస్‌ చేయటానికి ఒక మార్గమంటూ ఏర్పడ్డాక మరిన్ని శాంపిల్స్‌ను ప్రాసెస్‌ చేయటానికి పెద్దగా ఖర్చులుండవు. ఇదే ఈ కంపెనీ విజయ రహస్యం.  

మెట్రోపోలిస్‌... పరీక్షల్లో ప్రత్యేకత 
ఇదికూడా పాథాలజీ ఫోకస్‌తో నడుస్తున్నదే. కానీ దీని పెట్టుబడులు మాత్రం ఒకింత ప్రత్యేకం.  మెట్రోపాలిటన్‌ మార్కెట్లలో విస్తరించిన ఈ కంపెనీ కొన్ని ప్రత్యేక పాథాలజీ పరీక్షలకు ప్రాధాన్యమిస్తోంది. ఎందుకంటే సాధారణంగా చేసే బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిలు, సీబీసీ, థైరాయిడ్‌ వంటి పరీక్షలకు పోటీ ఎక్కువ. కానీ అంకాలజీ, హిస్టోపాథాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌ వంటి అధునిక పరీక్షల్లో పోటీ తక్కువ. నిజానికి ఒక కంపెనీని ఎన్ని పరీక్షలు చేస్తోందన్న ఒకే ఒక అంకెంతో అంచనా వేయటం సరికాదు. 

ఎందుకంటే తాను చేసే పరీక్షల్లో ఆధునికాంశాలను ప్రవేశపెట్టడం వల్ల ఒక కంపెనీ పరీక్షల శాతం 10 పెరిగి... రెవెన్యూ 15 శాతం పెరగొచ్చు. మరో కంపెనీ పరీక్షల సంఖ్య 20 శాతం పెరిగినా... పోటీ కారణంగా రెవెన్యూ 10 శాతమే పెరగొచ్చు. ఇదిగో... మెట్రో పోలిస్‌ డయాగ్నస్టిక్స్‌ను కూడా రెండో కేటగిరీ సంస్థగానే చూడాలి. ఎందుకంటే ఈ సంస్థ ప్రత్యేక పరీక్షలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ  వెళుతోంది. పేషెంట్ల సంఖ్యతో పాటు ప్రత్యేక పరీక్షలను ఎన్నింటిని కొత్తగా తెస్తున్నారు? నెట్‌వర్క్‌ ఏ స్థాయిలో విస్తరిస్తోంది? ఖర్చులు అంతకంతకూ తగ్గుతూ ఆపరేషన్స్‌ సౌలభ్యం ఏ స్థాయిలో పెరుగుతోంది? అనే అంశాలు మెట్రోపోలిస్‌ విషయంలో మున్ముందు జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఇవి గనక సరిగా ఉంటే... అప్పుడు దీనిపై దృష్టి పెట్టొచ్చు.  

చందన్‌ హెల్త్‌కేర్‌... దూకుడుగా విస్తరణ 
పాథాలజీ, రేడియోలజీ రెండింట్లోనూ ఉండి... దూకుడుగా విస్తరిస్తున్న చందన్‌ హెల్త్‌కేర్‌ను కూడా ఇన్వెస్టర్లు వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. యూపీకి చెందిన ఈ కంపెనీ ఇటీవలే ఇతర నగరాలకూ విస్తరించటం మొదలుపెట్టింది. ఈ ఏడాది సెపె్టంబరు నాటికి సంస్థ ఫ్రాంఛైజీ నెట్‌వర్క్‌ 500 కేంద్రాలను దాటింది. ఇందులో కొన్ని ఇతర డయాగ్నస్టిక్‌ కంపెనీల నుంచి కొన్న సెంటర్లూ ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశమేంటంటే విస్తరణ దూకుడుగా ఉన్నంత మాత్రాన రాబడి ఆ స్థాయిలో వస్తుందని కాదు. అక్కడి అద్దెలు, సిబ్బంది ఖర్చులు, యంత్రాల నిర్వహణ, తరుగుదల, మార్కెటింగ్‌... ఇవన్నీ పోగా లాభాలు ఎంత వస్తాయనేది ప్రధానం.  


సురక్ష డయాగ్నోస్టిక్స్‌.. తూర్పున కొత్త స్టోరీ 
పాథాలజీ పరీక్షలను దేశమంతటా విస్తరించటం హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో మరీ అంత కష్టమేమీ కాదు. కానీ సురక్ష మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకుంది. మొదట తూర్పు భారతంలో విస్తరించి... ఆ తరవాతే మిగతా ప్రాంతాలకు వెళ్లాలనుకుంది. పాథాలజీతో పాటు రేడియోలజీ, మెడికల్‌ కన్సల్టేషన్‌ సేవల్ని అందిస్తున్న ఈ సంస్థ... 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.310 కోట్ల రెవెన్యూను, రూ.98.6 కోట్ల ఎబిటాను సాధించింది. అంతకు ముందటేడాది రెవెన్యూ రూ..252 కోట్లే. కాకపోతే ఎబిటా మార్జిన్లు మాత్రం 33.8 శాతం నుంచి 31.8 శాతానికి తగ్గాయి. నికరలాభం కూడా అంతంతమాత్రంగానే పెరిగింది. అంటే రెవెన్యూ 23 శాతం పెరిగినా ఎబిటా మాత్రం 16 శాతమే పెరిగింది. నికరలాభానికొచ్చేసరికి పెరుగుదల కేవలం 1 శాతం. దీన్నిబట్టి పరీక్షల్లో, రెవెన్యూలో వృద్ధి కనిపించినా అది లాభాల్లో ఉండకపోవచ్చన్నది ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవాలి.   
ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫలితాల్లో ఊహించని మార్పులొచ్చాయి. రెవెన్యూ 21 శాతం పెరగ్గా... ఎబిటా  28 శాతం... నికరలాభం ఏకంగా 40 శాతం పెరిగాయి. ఎబిటా మార్జిన్‌ పెరిగి ఏకంగా 36 శాతానికి చేరింది. మరి ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా? అదే ఇన్వెస్టర్లు గమనించాల్సింది.

అసలైన రిస్కు ఇదే... 
కంపెనీలు వేటికవి దూకుడుగా విస్తరించడానికే ప్రయతి్నస్తున్నాయి. కాకకపోతే ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, డిజిటల్‌ హెల్త్‌ కంపెనీలు, ఈ ఫార్మసీలు... ఇవన్నీ 
డయాగ్నస్టిక్‌ రంగంపై కన్నేశాయి. తాము కూడా ఇందులో ప్రవేశించటం ద్వారా ఎంతో కొంత  సంపాదించవచ్చని గమనించాయి. తమ డయాగ్నస్టిక్స్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇది డయాగ్నస్టిక్‌ కంపెనీలకు పెద్ద రిస్కే. కాబట్టి ఈ మార్పులతో పాటు ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు ప్రధానంగా ఎవరు ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు? ఎవరు ఎక్కువ మార్జిన్లు సాధిస్తున్నారు? పెట్టిన పెట్టుబడిపై ఎవరు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు? ఈ మూడే అసలైన విజేతను నిర్ణయిస్తాయి.  

ఎవరి వాటా ఎంత? 
ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్లో ఒక పేషెంట్‌ రూ.1000 చెల్లించాడనుకుందాం. మరి అందులో ఎవరి వాటా ఎంత? శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌కు పోతున్నదెంత? డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళుతున్నదెంత? టెస్టింగ్‌ కిట్లకెంత? పరీక్షా యంత్రాల వాటా ఎంత? లాజిస్టిక్స్‌కు... డాక్టర్‌కు లేదా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌కు వెళుతున్నదెంత? అసలు ఈ వెయ్యిలో ఎక్కువ భాగం ఎవరిది? ఇది కదా ఇన్వెస్టర్లు చూడాల్సింది? ఎలా తెలుసుకోవాలి మరి?... తదుపరి భాగంలో...

రమణమూర్తి మంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement