భారత వృద్ధిపై ఎస్‌ అండ్‌ పీ విశ్వాసం | Sakshi
Sakshi News home page

భారత వృద్ధిపై ఎస్‌ అండ్‌ పీ విశ్వాసం

Published Tue, Sep 27 2022 6:06 AM

S and P Global retains India 2022-23 growth hopes at 7. 3percent - Sakshi

న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్‌అండ్‌పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్‌అండ్‌పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది.

ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్‌లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఆసియా పసిఫిక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ లూయిస్‌ కూజ్స్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్‌బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్‌ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే.  

రూపాయిలో అస్థిరతలు..  
రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్‌అండ్‌పీ ఆర్థికవేత్త విశృత్‌ రాణా అంచనా వేశారు. అయితే, భారత్‌ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్‌తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్‌ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement