42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5 లక్షల కోట్లు!

RS 5 5 Lakh Crore Business Expected From This Wedding Season - Sakshi

మన దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. జనవరి 15 నుంచి జులై 15 వరకు దేశం మొత్తం మీద సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. దీని ద్వారా దేశంలో బిజినెస్ పెద్ద ఎత్తున జరిగే సూచనలు ఉన్నట్లు సమాచారం.

ఈ ఏడాది జులై 15 వరకు జరిగే పెళ్లిళ్ల ద్వారా సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ వెల్లడించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రమే 4 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార ఆదాయం సమకూరుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి, ఈ పెళ్లిళ్ల ద్వారా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగినట్లు తెలిసింది.

వ్యాపారుల సంఘం ప్రకారం, ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఒక్కో పెళ్లికి కనీసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని. సంపన్నులు పెళ్లి చేసుకుంటే ఈ ఖర్చు కోట్ల రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది. ప్రతి వివాహానికి అయ్యే ఖర్చులో దాదాపు 20 శాతం వరుడు, వధువు కుటుంబాలకు ఇద్దరికీ కేటాయించినా.. మిగిలిన 80 శాతం వివాహ ఏర్పాట్లలో పాలుపంచుకున్న  థర్డ్ పార్టీ ఏజెన్సీలకు వెళుతుందని సీఏఐటీ అధికారులు వెల్లడించారు.

పెళ్లి అనగానే హౌస్ రేనోవేషన్, పెయింటింగ్ వంటివి మాత్రమే కాకుండా.. నగలు కొనుగోలు చేయడం, బట్టలు, ఫర్నిచర్, రెడీమేడ్ వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, వివాహ గ్రీటింగ్ కార్డులు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా సామాగ్రి, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ, ఎలక్ట్రికల్ యుటిలిటీస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్‌.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్‌!

పెళ్లి అవసరాలకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాక.. బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్‌హౌస్‌లు వంటి వివాహ వేదికలు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. వాటిని అలంకరించడానికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీదే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top