
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం గత కొద్ది రోజులుగా ప్రమోషన్‌లలో నిమగ్నమైంది. సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని షూటింగ్‌ను పూర్తి చేశాడు రాజమౌళి. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నారంటే...ఆ సమయంలోని బైక్‌ను తీసుకొచ్చి మరి ఆర్‌ఆర్‌ఆర్‌ను చిత్రించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ నడిపిన బైక్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ నడిపిన బైక్ ఇదే...!
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ వెలోసెట్ రెట్రో బైక్ నడుపుతూ కనిపించాడు. ఇది ఏ మోడల్ అని స్పష్టంగా చెప్పలేనప్పటికీ.. ఆ బైక్ 1934 కు చెందిన ఎమ్ సిరీస్ బైక్‌లా కనిపిస్తోంది. సినిమా కోసం బైక్‌లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. బ్రిటిన్‌కు చెందిన వెలోసెట్(Velocette) కంపెనీకి చెందిన ఎమ్ సిరీస్ బైక్‌ను వాడినట్లు తెలుస్తోంది. వెలోసెట్ ఎమ్ సిరీస్ బైక్ ధర సుమారు రూ. 9 లక్షలుగా ఉంది. ఇలాంటి రెట్రో బైక్స్ ఎక్కువగా అక‌్షన్ వెబ్‌సైట్‌లోనే కన్పిస్తాయి. ఈ బైక్ కోసం రాజీమౌళి ఎంతమేర ఖర్చుపెట్టారో తెలియాల్సి ఉంది.
హ్యండ్‌మేడ్ బైక్స్ చేయడంలో దిట్ట..!
హ్యండ్‌మేడ్ బైక్‌లను తయారు చేయడంలో వెలోసెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వరకు...వెలోసెట్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను తయారు చేసింది. వెలోసెట్‌కు చెందిన 500 సీసీ బైక్ ను ఏకదాటిగా 24 గంటల పాటు గంటకు 161 కిలోమీటర్ల వేగంతో నడిపిన రికార్డు కూడా ఉంది.
సైకిల్ ఫ్రేమ్స్ నుంచి..!
వెలోసెట్ కంపెనీను తొలుత 1896లో జాన్ గుడ్‌మాన్, విలియం గూ "టేలర్, గ్యూ కో లిమిటెడ్"గా స్థాపించారు. కంపెనీ మొదట్లో సైకిల్ ఫ్రేమ్‌లు, ఇతర భాగాలను తయారు చేసేది, కానీ తరువాత అది మోటార్ సైకిళ్ల కోసం ఫ్రేమ్‌లను రూపొందించడం ప్రారంభించింది. 1905 సంవత్సరంలో కంపెనీ తన మొదటి మోటార్‌సైకిల్ వెలోస్‌ను తయారు చేసింది. వెలోస్ అనేది ఇటాలియన్ పదం. దీని అర్థం "వేగవంతమైనది". ఆ సమయంలో అత్యంత వేగవంతమైన బైక్‌గా వెలోసెట్ నిలిచింది.
1913లో కంపెనీ తన మొదటి టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది, దీనికి వెలోసెట్ అనే నిక్ నేమ్ ఇచ్చింది. దీనిలో కే సిరీస్ బైక్లను 1925 సంవత్సరంలో ప్రారంభించగా..కె సిరీస్ బైక్‌ల ధర ఎక్కువగా ఉండటంతో, తక్కువ ధరకే బైక్లను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. 1934 సంవత్సరంలో కొత్త ఎమ్ సిరీస్ ఓవర్ హెడ్ వాల్వ్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది.
ఇందులో 350సీసీ, 500 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో MAC 350, MSS 500 బైక్లను రిలీజ్ చేసింది. 192సీసీ సామర్థ్యం గల వాటర్ కూల్డ్ ఫ్లాట్ ట్విన్ ఇంజన్‌ను రూపొందించింది. ఈ బైక్‌ను బ్రిటిష్ పోలీసులు ఎక్కువగాఉపయోగించారు. ఈ బైక్‌ను నోడీ బైక్ అని కూడా పిలిచేవారు. తరువాతి సంవత్సరాలలో, కంపెనీ అనేక కొత్త మోడళ్లను పరిచయం చేసింది, కొన్ని పాత మోడళ్ల యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లు కూడా మార్కెట్లో విడుదలయ్యాయి.
ఎంత స్పీడ్‌గా వచ్చిందో అంతే స్పీడ్‌గా నిష్క్రమించింది..
ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీరావడంతో వెలోసెట్ బైక్ల ఉత్పత్తిని నిలిపివేసింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బైక్స్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి ఎంత స్పీడ్‌గా వచ్చిందో అంతే స్పీడ్‌గా వెలోసెట్ కథ ముగిసింది. ఆ సమయంలో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. దీంతో ఫిబ్రవరి 1971లో కంపెనీ అధికారికంగా బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది.
చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..!