ఫేస్‌బుక్‌కు షాక్‌.. మయన్మార్‌ ఊచకోతలో కీలక పాత్ర! ఆధారాలతో సహా కోర్టుకు రొహింగ్యా శరణార్థులు

Rohingya Refugees Sue Facebook Over Myanmar Hate Speech - Sakshi

సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌కు భారీ షాక్‌ తగిలింది. రొహింగ్యా శరణార్థులు కొందరు మెటా(ఇంతకు ముందు ఫేస్‌బుక్‌) కంపెనీ ఫ్లాట్‌ఫామ్‌ మీద దావా వేశారు. అదీ తమ జీవితాలు నాశనం అయ్యాయని 150 బిలియన్‌ డాలర్ల భారీ పరిహారం కోరుతూ!.
 

యూకే, యూఎస్‌లోని డజను కొద్దీ రొహింగ్యా శరణార్థులు.. ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా దావా వేశారు. మయన్మార్‌లో తమకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగానే నడిచిందని, ఆ ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్‌బుక్‌ ఘోరంగా విఫలం అయ్యిందని, పైగా తమ వర్గానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించిందనేది వాళ్ల ప్రధాన ఆరోపణ. అందుకే నష్టపరిహారం కింద మెటా కంపెనీ నుంచి 150 బిలియన్‌డాలర్లు(దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు పైనే)  కోరుతున్నారు.

యూకేకు చెందిన లీగల్‌ కంపెనీలు ఎడెల్‌సన్‌ పీసీ, ఫీల్డ్స్‌ పీఎల్‌ఎల్‌సీలు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా ‘రొహింగ్యాల జీవితాల్ని నాశనం చేశారంటూ’ శాన్‌ ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా)లో న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. అంతేకాదు లండన్‌లోని ఫేస్‌బుక్‌ కార్యాలయానికి నోటీసులు సైతం అందించారు. ఈ మేరకు 2013లో రొహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్‌బుక్‌ ప్రచారాలను కోర్టుకు సమర్పించింది.

మయన్మార్‌లో ఫేస్‌బుక్‌కు 2 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. సమాచారాల షేరింగ్‌ ద్వారానే విపరీతమైన ఆదాయం వెనకేసుకుంది ఫేస్‌బుక్‌ అక్కడ.


2017, ఆగష్టులో మిలిటరీ ఆక్రమణ సమయంలో చెలరేగిన హింస కారణంగా లెక్కకందని మరణాలు, అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. ఊళ్లకు ఊళ్లే తగలబడిపోయాయి. సుమారు ఏడున్నర లక్షల మంది రొహింగ్యాలు దేశం విడిచిపారిపోయారు.  దీనింతటికి ఫేస్‌బుక్‌ ద్వారా జరిగిన ప్రచారమేనన్నది ప్రధాన ఆరోపణ. 

ఇక 2018లో ఐరాస మానవ హక్కుల దర్యాప్తు బృందం.. హింసకు ఫేస్‌బుక్‌ ద్వారా జరిగిన ప్రచారమేనని తేల్చి చెప్పారు. 

ఓ అంతర్జాతీయ మీడియా హౌజ్‌ చేపట్టిన దర్యాప్తులోనూ వెయ్యికిపైగా పోస్టులు, కామెంట్లు, రొహింగ్యాల మీద దాడుల ఫొటోలు బయటపడ్డాయి. 

ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు.. ఆ ప్రాంతంలో జరిగిన నేరారోపణలపై ఒక కేసు దాఖలు చేసింది. ఈ సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్‌ కోర్టు.. రొహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫేస్‌బుక్‌ అకౌంట్ల(ఆ తర్వాత ఫేస్‌బుక్‌వాటిని మూసేసింది) వివరాలను సమర్పించాలని కోరింది.

  

ఈ ఏడాదిలో ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హ్యూగెన్‌.. అంతర్గత డాక్యుమెంట్లు లీక్‌ చేయడంతో పాటు పలు దేశాల్లో(మయన్మార్‌  విద్వేషపూరిత, హానికారక  సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించింది కూడా. 

మయన్మార్‌ మిలిటరీ కూడా ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్లతో రొహింగ్యాలకు వ్యతిరేకంగా సమాచారాన్ని వైరల్‌ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ దావాపై ఫేస్‌బుక్‌ స్పందించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, 2018లోనే తమ వైఫల్యంపై ఒక ప్రకటన విడుదల చేసింది.  మయన్మార్‌లో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో, వ్యతిరేక ప్రసంగాల్ని అడ్డుకోవడంలో కొంచెం నిదానించిన మాట వాస్తమేనని పేర్కొంది.  అంతేకాదు మయన్మార్‌ మిలిటరీని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ నుంచి నిషేధించడం కూడా కొంచెం ఆలస్యం అయ్యిందని పేర్కొంది. 

అమెరికా ఇంటర్నెట్‌ చట్టం సెక్షన్‌ 230 ప్రకారం.. యూజర్‌ పోస్ట్‌ చేసే కంటెంట్‌ మీద మాత్రమే ఫేస్‌బుక్‌కు నియంత్రణ ఉంటుంది. మూడో వ్యక్తి చేసే కంటెంట్‌ను నియంత్రణ చేయలేదు. అయితే ఇది బర్మీస్‌ చట్టాలకు(ఫారిన్‌ చట్టాలకు) అన్వయిస్తుందా? ఫేస్‌బుక్‌ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? రొహింగ్యాలకు అనుకూలంగా ముందుకు వెళ్తుందా? అనేది  తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!. 

చదవండి: సోషల్‌ మీడియాను మించిన డేంజర్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top