భారీగా క్రెడిట్‌ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్‌ | Robert Kiyosaki Warns Credit Card Debt Trap Over Lifestyle Spending | Sakshi
Sakshi News home page

భారీగా క్రెడిట్‌ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్‌

Jun 15 2026 2:34 PM | Updated on Jun 15 2026 2:49 PM

 Robert Kiyosaki Warns Credit Card Debt Trap Over Lifestyle Spending

ప్రపంచ ‍ప్రసిద్ధ పర్సనల్‌ పైనాన్స్‌ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్‌ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.

ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్‌ కార్డులపై 1.28 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని  అభిప్రాయపడ్డారు.

అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్‌ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్‌గ్రేడ్‌లు, వివిధ సబ్‌స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.

తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’లో ఉపయోగించిన “డూడాడ్స్‌ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

ప్రస్తుతం సగటు అమెరికన్‌ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్‌ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్‌ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement