అఫర్డబుల్‌ హౌస్‌ లోన్స్‌ .. వారికి కష్ట కాలమే!

Rising interest rates inflation to affect affordable housing finance companies growth - Sakshi

కొనుగోలు సెంటెమెంట్‌పై ప్రభావం  ఇండియా రేటింగ్స్‌ నివేదిక  

రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రతికూలం 

ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్‌) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణరంగ వ్యయాలు పెరిగి పోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్‌ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు.

ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్‌ ఫైనాన్స్‌ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అదిప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది.

‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్‌ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్‌ ఫైనాన్స్‌ (గృహ రుణాలు) మార్కెట్‌ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది.  

పెరగనున్న భారం 
‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1-6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్‌ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8-13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది.

‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్‌ సహా ఎన్నో ముడిసరుకు ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది.

కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20-25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది.  
     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top