ఫార్చ్యూన్‌ జాబితాలో రిలయన్స్‌ డౌన్‌...

Reliance Industries Slips 59 Places Fortune List SBI Jumps 16 Notches - Sakshi

59 స్థానాలు దిగజారి 155కు 

2017 తర్వాత తక్కువ ర్యాంకు 

16 స్థానాలపైకి ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ‘ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500’ కంపెనీల జాబితా 2021లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 59 స్థానాలు కిందకు దిగిపోయింది. 155వ స్థానంలో నిలిచింది. 2017 తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఇంత తక్కువ ర్యాంకు రావడం ఇదే మొదటిసారి. రిలయన్స్‌ ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు కారణం. రిలయన్స్‌ ఆదాయం 25.3 శాతం తగ్గి 63 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఈ జాబితా పేర్కొంది. 2020 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) చమురు ధరలు భారీగా పతనం అవ్వడం తెలిసిందే. అది ఆదాయం తగ్గేందుకు దారితీసింది. 524 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అమెరికన్‌ కంపెనీ వాల్‌మార్ట్‌ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాకు చెందిన స్టేట్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ 384 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. 280 బిలియన్‌ డాలర్ల ఆదాయం కలిగిన అమెజాన్‌ మూడో స్థానంలోను, చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్, సినోపెక్‌ గ్రూపు ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. 

ఇతర చమురు కంపెనీల పరిస్థితీ అంతే  
ఈ జాబితాలో దేశీయ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ 16 స్థానాలు పెంచుకుని 205కు చేరుకుంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) 61 ర్యాంకుల కిందకు పడిపోయి 212 స్థానంలో నిలిచింది. ఓఎన్‌జీసీ 243 (53 స్థానాలు తక్కువ), రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 348 (114 స్థానాలు అధికం), టాటా మోటార్స్‌ 357 (20 స్థానాలు తక్కువ), భారత్‌ పెట్రోలియం 394 (క్రితం ఏడాది 309) ర్యాంకులు దక్కించుకున్నాయి. 2021 మార్చికి ముందు ఆయా కంపెనీల మొత్తం ఆదాయం (ఆర్థిక సంవత్సరం వారీగా) ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించినట్టు ఫారŠూచ్యన్‌ సంస్థ తెలిపింది. ఈ జాబితాలోని ఎస్‌బీఐ ఆదాయం 52 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఐవోసీ ఆదాయం 50 బిలియన్‌ డాలర్లు, ఓఎన్‌జీసీ ఆదాయం 46 బిలియన్‌ డాలర్లు, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఆదాయం 35 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉండడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top