నేషనల్‌ హైవేలతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు

Real Estate Development Along With National Highways - Sakshi

వేర్‌హౌస్, రిటైల్‌ పెట్టుబడులకు అవకాశం ∙60–80 శాతం భూముల ధరల వృద్ధి 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్ట్స్, రిటైల్‌ ఔట్‌లెట్స్, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ చార్జింగ్‌ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్‌ఎల్‌ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాపర్టీల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్‌హెచ్‌ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్‌ మోనటైజేషన్‌ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్‌ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్‌ఎల్‌ పని. 

3 వేల హెక్టార్ల అభివృద్ధి.. 
జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్‌ పార్క్‌లు, వేసైడ్‌ ఎమినిటీస్‌ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్‌ హైవే/ఎక్స్‌ప్రెస్‌లు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది.  

15–30 శాతం ఆదాయం.. 
ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్‌ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్‌ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్‌ఎల్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ అండ్‌ వాల్యుయేషన్‌ అడ్వైజరీ హెడ్‌ శంకర్‌ అంచనా వేశారు. క్లియర్‌ ల్యాండ్‌ టైటిల్, ఉచిత ఎన్‌కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్‌ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్‌ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్‌మెంట్‌తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top