ధరల స్పీడ్‌ కట్టడికి కేంద్రం చర్యలు దోహదం

RBI governor sees positive outlook on India economic growth - Sakshi

పెట్రో ఉత్పత్తుల ఎక్సైజ్‌ సుంకం

తగ్గింపుపై ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్య

సరఫరాల సమస్య పరిష్కారానికీ

చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి

ముంబై: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో సానుకూల అంశమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కట్టడిలోనే ఉన్నప్పటికీ, మొత్తంగా అన్ని విభాగాలూ చూస్తే, ద్రవ్యోల్బణం పెరుగుదల కనబడుతోందని ఆయన అన్నారు. అయితే సరఫరాల సమస్య భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణమని వివరించారు.

ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాల విషయంలో సరఫరాల సమస్యలను తొలగించంతోపాటు, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం ఇటీవల తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కదలికలను ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బిజినెస్‌ స్టాండర్డ్‌ నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ సదస్సులో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రసంగం చేశారు.

  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి కీలకమైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది.  రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్‌ పునరుద్ధర ణకు దోహదపడుతుంది. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది.

క్రిప్టో కరెన్సీలపై ఆందోళన
బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలపై గవర్నర్‌ మరోసారి తన ‘‘తీవ్ర ఆందోళన’’ను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ స్థిరత్వం కోణంలో పరిశీలిస్తే, రెగ్యులేటర్‌గా తమకు క్రిప్టో కరెన్సీలపై ఆందోళన ఉందని వివరించారు. క్రిప్టో మార్కెట్‌లో పాల్గొనే వారి సంఖ్యను భారీగా పెంచి చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయితే పరిమాణం పరంగా సంఖ్య పెరుగుతోందని మాత్రం అంగీకరించారు.  క్రిప్టో మార్కెట్‌లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని గవర్నర్‌ తెలిపారు.  క్రిప్టోకరెన్సీలపై  కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ సవివరమైన నివేదికను సమర్పించిందని, ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.

క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్‌ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్‌బీఐ నిర్వహి స్తుందా? అన్న ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్‌ నిరాకరించారు. ఈ ఏడాది మేల్లో కూడా దాస్‌ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి ప్రతికూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ  ఫైనాన్షియల్‌ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగు తోందని ఈ వార్తల కథనం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై దాస్‌ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top