గృహ కొనుగోలుదారులకు ఖతార్‌ రెడ్‌ కార్పెట్‌

Qatar invites foreigners to buy property visas - Sakshi

విదేశీయులకు ఆహ్వానం పలుకుతున్న ప్రభుత్వం

గల్ఫ్‌ దేశంలో ప్రాపర్టీ కొనుగోలుకి చాన్స్‌

సీసైడ్‌ టవర్లలో బ్లాకులు, రిటైల్‌ ఆస్తులు రెడీ

10 లక్షల డాలర్లు వెచ్చిస్తే శాశ్వత నివాసం

దోహా: ప్రధానంగా ఇంధన అమ్మకాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు ఇతర మార్గాలలోనూ మద్దతివ్వాలని భావిస్తున్న ఖతార్‌ ప్రభుత్వం తాజాగా విదేశీయులకు ప్రాపర్టీ మార్కెట్‌ ద్వారా ఆహ్వానం పలుకుతోంది. నిజానికి సెప్టెంబర్‌లోనే ఈ పథకానికి తెర తీసినప్పటికీ.. తాజాగా మరిన్ని సంస్కరణలు చేపట్టింది. 2022లో నిర్వహించనున్న వరల్డ్‌ కప్‌ కంటే ముందుగానే భారీగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే ప్రణాళికల్లో భాగంగా రియల్టీ ఆస్తుల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. అర్హతగల కొనుగోలుదారులకు సముద్రపు ఒడ్డునగల ఆకర్షణీయ పెరల్‌ ఐలాండ్‌ లేదా కొత్తగా ఏర్పాటు చేసిన లుజైల్‌ సిటీ ప్రాజెక్టును ఇందుకు కేటాయించింది. ఇక్కడ వరల్డ్‌ కప్‌ స్టేడియాన్ని నిర్మించింది. సీసైడ్‌ టవర్లలో బ్లాకులతోపాటు.. రిటైల్‌ యూనిట్లను సైతం కొనుగోలుదారులకు ఆఫర్‌ చేయనుంది. తద్వారా పెట్రో డాలర్లకు ప్రాపర్టీ విక్రయాల ఆదాయాన్ని జత చేయడం ద్వారా ఆర్థికంగా మరింత బలపడాలని చూస్తోంది. 

ధరలకు దన్నుగా
సరఫరాకు తగిన డిమాండ్ లేకపోవడంతో టవర్లలో సగంవరకూ ఖాళీగానే ఉన్నట్లు రెసిడెన్షియల్‌ ఆస్తులకు సంబంధించిన వలుస్ట్రాట్స్‌ ధరల ఇండెక్స్‌ పేర్కొంది. దీంతో 2016 నుంచి ప్రాపర్టీ ధరలు మూడోవంతు క్షీణించినట్లు తెలియజేసింది. తాజా సంస్కరణల కారణంగా విదేశీయులు ఖతార్‌లోని 25 ప్రాంతాలలో కొత్తగా గృహాలను సొంతం చేసుకునేందుకు వీలుంటుంది. ప్రధానంగా రాజధాని దోహాలో ఇందుకు అధిక అవకాశాలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 9 ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాలలో 99 ఏళ్ల కాలానికి లీజ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

10 లక్షల డాలర్లు..
గతంలో రెసిడెన్సీ కోసం ఖతార్‌ బిజినెస్‌ లేదా వ్యక్తుల నుంచి భాగస్వామ్యం(స్పాన్సర్‌షిప్‌) తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం 2 లక్షల డాలర్ల విలువైన ప్రాపర్టీ కొనుగోలు ద్వారా తాత్కాలికంగా యాజమాన్య హక్కులు పొందేందుకు వీలుంటుంది. 10 లక్షల డాలర్లు వెచ్చించగలిగితే.. శాశ్వత నివాసానికి వీలు కల్పించనుంది. దీనిలో భాగంగా విద్య(స్కూళ్లు), ఆరోగ్యం(హెల్త్‌కేర్‌) ఉచితంగా అందించనుంది. గత 15ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నప్పటికీ అనధికార మార్కెట్‌ వల్ల సొంత ఇల్లు సమకూర్చుకోలేకపోయినట్లు కెన్యన్‌ మహిళ టీనా చడ్డా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం శాశ్వత నివాసానికి వీలు కల్పించడంతో ఖతార్‌లో సొంత ఇంటి కలను నెరవేర్చుకోనున్నట్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చడ్డాకుగల వీసా ద్వారా కుటుంబ సభ్యులతోపాటు తల్లిదండ్రులనూ నైరోబీ నుంచి ఖతార్‌కు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దుబాయ్‌ 2.7 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 10ఏళ్ల రెసిడెన్సీ వీసాను ఆఫర్‌ చేస్తోంది. ఈ నిధుల్లో 40 శాతంవరకూ ప్రాపర్టీకే వినియోగించవలసి ఉంటుంది. కాగా.. గోల్డెన్‌ వీసాలుగా పేర్కొనే ఇలాంటి పథకాల ద్వారా అవినీతిపరులకు అవకాశం కలుగుతున్నదని, అంతేకాకుండా మనీలాండరింగ్‌కూ వీలు చిక్కుతున్నదని ఆరోపణలు వెలువడుతున్న విషయం విదితమే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top