గృహమస్తు! ఊపందుకున్న క్రయవిక్రయాలు

PropTiger report Housing sales rise in Jan-March - Sakshi

గ్రేటర్‌లో ఊపందుకున్న ఇళ్ల విక్రయాలు 

జనవరి-మార్చిలో 38శాతం పెరుగుదల  

గత ఏడాది ఇదే సమయంలో 5,554.. 

ఈసారి 7,721 ఇళ్ల కొనుగోళ్లు 

ప్రాప్‌ టైగర్‌ తాజా అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో ఇళ్ల క్రయ విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నెలవుగా మారిన మహానగర పరిధిలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు వేతన జీవులు, మధ్యతరగతి వర్గంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన సగటు జీవులు సైతం ముందుంటున్నారు. ఈ పరిణామంతో నగర శివార్లలో స్వతంత్ర గృహాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రముఖ స్థిరాస్తి అంచనా సంస్థ ప్రాప్‌ టైగర్‌ తాజా అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో నగరంలో ఇళ్లు ,ఫ్లాట్ల అమ్మకాల్లో వృద్ధి 38 శాతం మేర నమోదైనట్లు ఈ అధ్యయనంలో తేలింది.  దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో అమ్మకాలు 5 శాతం క్షీణించగా.. ఆయా సిటీలతో పోలిస్తే గ్రేటర్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్లు స్పష్టమైంది.  

కల.. నెరవేరుతోందిలా.. 
 ప్రధానంగా మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఔటర్‌రింగ్‌ రోడ్డు లోపలున్న 190 గ్రామాలు, 10కిపైగా ఉన్న నగరపాలక సంస్థల పరిధిలో స్వతంత్ర గృహాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి.  
 జనవరి-మార్చి మధ్యకాలంలో ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లను పరిశీలిస్తే.. సుమారు 7,721 గృహాల కొనుగోళ్లు జరిగినట్లు ప్రాప్‌ టైగర్‌ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది  జనవరి– మార్చి మధ్యకాలంలో కేవలం 5,554 అమ్మకాలే జరిగినట్లు ఈ నివేదిక తెలిపింది. 

కొనుగోళ్లు తగ్గలేదు: ప్రస్తుతం సిమెంటు, స్టీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ తదితర నిర్మాణరంగ మెటీరియల్‌ ధరలు 30 శాతం పెరిగాయి. దీంతో ఇళ్ల ధరలు సైతం అనివార్యంగా 15-20 శాతం పెరిగాయి. అయినా ఇళ్ల నిర్మాణాలు, కొనుగోళ్లు తగ్గడంలేదు.- రాంరెడ్డి, క్రెడాయ్‌ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు

మధ్యతరగతికి అందుబాటులో: మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిర్మిస్తున్న స్వతంత్ర గృహాలకు ఇటీవల కాలంలో డిమాండ్‌ బాగా పెరిగింది. ధరలు మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి.   – వి.ప్రవీణ్‌రెడ్డి, మైత్రీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ  
   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top