పీడబ్ల్యూసీ రూ.1,600 కోట్ల పెట్టుబడులు

Price waterhouse Coopers India to invest Rs 1,600 crore, - Sakshi

అయిదేళ్లలో మరో 10,000 ఉద్యోగాలు

నూతన వ్యాపార వ్యూహం వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సంస్థ పీడబ్ల్యూసీ భారత్‌లో వచ్చే అయిదేళ్లలో రూ.1,600 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. అదనంగా 10,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించింది. ఈ కాలంలో క్యాంపస్‌ల ద్వారా నియామకాలను అయిదురెట్లకుపైగా పెంచనున్నట్టు వివరించింది. డిజిటల్, క్లౌడ్, సైబర్, అనలిటిక్స్, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విభాగాల్లో ఈ రిక్రూట్‌మెంట్‌ ఉంటుంది. న్యూ ఈక్వేషన్‌ పేరుతో నూతన వ్యాపార వ్యూహాన్ని ప్రకటించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. మారుతున్న పోకడలు, వేలాది క్లయింట్లు, భాగస్వాములతో సంప్రదింపుల తదనంతరం ఈ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు వివరించింది.

‘భారతదేశం బలమైన ఆర్థిక మూల సిద్ధాంతాలను కలిగి ఉంది. జనాభా రూపంలో భారీ ప్రయోజనాలు, ఆవిష్కరణను పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. మా కొత్త వ్యూహం సంస్థకు, ఖాతాదారులకు, దేశ ఆర్థికాభివృద్ధిని మరింతగా పెంచడానికి.. అలాగే దేశీయ మార్కెట్‌ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, సమాజానికి ఎక్కువ అవకాశాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది’ అని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్‌ సంజీవ్‌ క్రిషన్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో సంస్థకు 15,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఉద్యోగులు, భాగస్వాముల నైపుణ్య శిక్షణకు ఆదాయంలో కనీసం 1 శాతం వెచ్చిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 155 దేశాల్లో సంస్థ విస్తరించింది. 2,84,000ల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top