అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్‌ విక్రయాలు!

Prelaunched sales with delayed approvals - Sakshi

నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్‌ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్‌ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్‌ రియల్‌ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి?

సాక్షి, హైదరాబాద్‌:  ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్‌.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్‌తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్‌ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్‌లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్‌ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు.

ప్రీలాంచ్‌లో విక్రయాలు ఎందుకంటే..
ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్‌ ఓనర్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్‌ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్‌ రుణానికి బ్యాంక్‌ వడ్డీ డెవలపర్‌ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్‌ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్‌ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్‌ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్‌లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్‌ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు.  

అనుమతుల్లో జాప్యం ఎందుకంటే?
టీఎస్‌–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్‌ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్‌మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్‌ తెలిపారు. హెచ్‌ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు.

ఏం చేయాలంటే?
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్‌ ప్రీలాంచ్‌లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్‌ఎంసీతో పోల్చితే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్‌ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్‌ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్‌ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్‌ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు.  

► హెచ్‌ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్‌ శాఖ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి.
► పక్క రాష్ట్రంలో లోకల్‌ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్‌ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్‌ అనుమతుల కోసం లోకల్‌ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top