వర్చువల్‌ రియాలిటీకి పెరుగుతున్న ఆదరణ

The popularity of virtual reality is growing exponentially - Sakshi

వీఆర్‌(వర్చువల్‌ రియాలిటీ) అనేది నిన్నటి వరకు గేమింగ్‌ ప్రియులకు ప్రియమైన మాట. ఇప్పుడు...వినోదానికి మాత్రమే కాదు విజ్ఞానానికి కూడా వీఆర్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయింది. క్లాస్‌రూమ్‌కు ప్రత్యామ్నాయంగా మారింది. సరికొత్త అవతారాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. కోవిడ్‌ పుణ్యమా అని ‘క్లాస్‌రూమ్‌’ మాయమైపోయింది. ఆన్‌లైన్‌ క్లాస్‌ దగ్గరైంది. ‘ఎంత ఆన్‌లైన్‌ అయితే మాత్రం ఏమిటీ? క్లాస్‌రూమ్‌ క్లాస్‌రూమే’ అనేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యం లో వీఆర్‌(వర్చువల్‌ రియాలిటీ)కి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. త్రీడి అవతార్‌లతో ‘నిజంగానే క్లాస్‌రూమ్‌లో ఉన్నాం’ అనే భావన కలిగిస్తుంది. 

వర్చువల్‌ రియాలిటీలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న పుష్పక్‌ గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించిన ‘నెక్ట్స్‌మీట్‌’కు మంచి స్పందన లభిస్తోంది. రియల్‌ టైమ్‌ ఇంటరాక్షన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ 3డి ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేశారు. ‘నెక్ట్స్‌మీట్‌’ తాజా వెర్షన్‌లో వర్చువల్‌ క్లాస్‌రూమ్స్, వర్చువల్‌ కాన్ఫరెన్స్, వర్చువల్‌ మీటింగ్స్, హెల్ప్‌డెస్క్, ప్రెజెంటేషన్‌ స్క్రీన్స్, వాకబుల్‌ త్రీడీ అవతార్‌... మొదలైన వెర్షన్‌లను ప్రవేశపెట్టారు. మనకు కరోనా వాసన సోక ముందుకే వర్చువల్‌ రియాలిటీ డ్రైవెన్‌ కంటెంట్‌తో చెన్నైలో మొదలైంది ‘డ్రీమ్‌ఎక్స్‌’ అనే టెక్‌-స్టార్టప్‌. 

ఇది ప్రధానంగా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్‌ రంగాలపై దృష్టి పెట్టింది. ఎడ్యుకేషన్‌ సెక్టర్‌లో వర్చువల్‌ ల్యాబ్స్, వర్చువల్‌ అండ్‌ ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. స్టూడెంట్స్‌ ల్యాబ్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ కోసం సెల్ఫ్‌-లెర్నింగ్‌ పాకెట్‌ లైబ్రరీ, ఏఆర్‌ టెక్నాలజీ మ్యాగజైన్‌లను తీసుకువచ్చింది. వైద్యవిద్యార్థుల కోసం వీఆర్‌ హ్యూమన్‌ అనాటమీ అప్లికేషన్‌ను డెవలప్‌ చేసింది. విద్యార్థులు ప్రాక్టిస్‌ చేయడం కోసం ఏసీఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ కార్డియక్‌ లైఫ్‌ సపోర్ట్‌) లాంటి వీఆర్‌ సిమ్యులేటర్స్‌ను ప్రవేశపెట్టింది.

‘జూమ్‌’కు వీఆర్‌ వెర్షన్‌గా చెప్పే ‘స్పెషల్‌’కు అంతకంతకూ ఆదరణ పెరగుతోంది. ‘యువర్‌ రూమ్‌ ఈజ్‌ యువర్‌ మానిటర్‌-యువర్‌ హ్యాండ్స్‌ ఆర్‌ ది మౌస్‌’ అని నినదిస్తున్న ‘స్పెషల్‌’ వీఆర్, ఏఆర్‌ల సమ్మేళన వేదిక. మరోవైపు వీఆర్‌ బేస్డ్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీఆర్‌చాట్, ఆల్ట్‌స్పేస్‌వీఆర్, రెక్‌ రూమ్‌...మొదలైన వీఆర్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వర్చువల్‌ ఎన్విరాన్‌మెంట్‌లో స్నేహితులు లేదా అపరిచితులు చాట్‌ చేయడానికి, ఆటలు ఆడుకోవడానికి వేదికగా ఉన్నాయి. ఇక ‘ఫేస్‌బుక్‌ హరైజన్‌’ దగ్గరికి వద్దాం.

‘కేవలం వర్చువల్‌ ప్రపంచాన్ని శోధించడానికి మాత్రమే కాదు మీకు స్ఫూర్తిని ఇచ్చే, మీకు ఆసక్తికరమైన ఎన్నో కొత్త విషయాలతో మమేకం కావడానికి స్వాగతం పలుకుతున్నాం’ అంటోంది ఫేస్‌బుక్‌ హరైజన్‌. ఎక్స్‌ప్లోర్, ప్లే, క్రియేట్, టుగెదర్‌... అనే ట్యాగ్‌లైన్‌తో యువతరాన్ని ఆకట్టుకుంటున్న ‘ఫేస్‌బుక్‌ హరైజన్‌’ ప్రస్తుతం ఇన్విటీ వోన్లీ-బీటాగా ఉంది. కాలం మీద కాలనాగై నిలుచుంది కరోనా. అంతమాత్రాన భయంతో ఏదీ ఆగిపోదు. సాంకేతిక దన్నుతో కొత్త ప్రత్యామ్నాయాలు వస్తుంటాయి. దీనికి బలమైన ఉదాహణ వీఆర్‌ ట్రెండ్‌.
 
పంచేంద్రియాలపై పట్టు!
కోవిడ్‌ నేపథ్యంలో విద్యారంగలో వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌)కి ప్రాధాన్యత మరింత పెరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. యూజర్‌ చూపు, వినికిడి...మొదలైన సెన్స్‌లపై తాజా వీఆర్‌ అప్లికేషన్లు కంట్రోల్‌ సాధించి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాయి. రాబోయే అయిదేళ్లలో ఏఆర్‌(ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ), వీఆర్‌లు ట్రాన్స్‌ఫర్‌మెషన్‌ టెక్‌ ట్రెండ్స్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

చదవండి:

Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top