చైనాతో వాణిజ్యలోటును ఎలా తగ్గిద్దాం?  | NITI Aayog initiates study on how to reduce trade gap with China | Sakshi
Sakshi News home page

చైనాతో వాణిజ్యలోటును ఎలా తగ్గిద్దాం? 

Oct 26 2023 8:06 AM | Updated on Oct 26 2023 10:32 AM

niti aayog to study on how to reduce trade deficit with China - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కీలక వాణిజ్య అంశాలు, సవాళ్లపై నీతి ఆయోగ్‌ దృష్టి సారించింది. కాలక్రమేణా చైనాతో భారత్‌ వాణిజ్య లోటును తగ్గించడం,  తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులలో వాణిజ్య వ్యూహాల రూపకల్పన, సరఫరాల వ్యవస్థ (సప్లై చైన్‌)ను రక్షించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, దేశీయ తయారీ పరిశ్రమ పురోగతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో వాణిజ్యలోటు తగ్గింపు, దేశీయంగా తయారీ రంగం పురోగతిపై రెండు అధ్యయనాలకు నాయకత్వం వహించడానికి కన్సల్టెంట్ల నుండి నీతి ఆయోగ్‌ బిడ్లను ఆహ్వానించింది.

భారతదేశం– చైనా మధ్య 2020 జూన్‌ నుంచి కొనసాగుతున్న గాల్వాన్‌ ఘర్షణ, ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా అంశం తెరమీదకు రావడం గమనార్హం. చైనాకు భారత్‌ ఎగుమతులకు సంబంధించి టారిఫ్, నాన్‌–టారిఫ్‌ అడ్డంకులు, నియంత్రణ వ్యవస్థ,  మార్కెట్‌ లభ్యతా ఆందోళనలను కూడా ప్రతిపాదిత అధ్యయనం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, భారతదేశాన్ని గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మార్చడానికి, ఈ దిశలో సవాళ్లను అధిగమించడానికి... గుర్తించిన రంగాలలో వృద్ధిని ప్రోత్సహించడానికి వ్యూహాలు– అనుసరించాల్సిన విధానాలను కూడా అధ్యయనం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. రెండు అధ్యయనాలకు సంబంధించి కన్సల్టెంట్ల బిడ్‌ల సమర్పణకు తుది గడువు నవంబర్‌ 7. గణాంకాలు, నిర్దిష్ట ప్రాముఖ్యత కలిగిన అంశాల  సేకరణ, విశ్లేషణ, సిఫార్సుల రూపకల్పన కోసం మాత్రం ఆరు నెలల గడువు ఉంటుంది.  

తగ్గిన లోటు భారం! 
భారత్‌ వస్తు వాణిజ్య పరిమాణం 2021–22 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. సమీక్షా కాలంలో వస్తు ఎగుమతుల విలువ 422 బిలియన్‌ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్‌ డాలర్లు. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 191 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదే సంవత్సరంలో చైనాతో భారత్‌ వాణిజ్య లోటు ఏకంగా 73.3 బిలియన్‌ డాలర్లు. అంటే మొత్తం వాణిజ్యలోటులో ఈ పరిమాణం దాదాపు 38 శాతం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి భారత్‌ వస్తు ఎగుమతులు 450 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్‌ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 264 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.

ఇందులో చైనాతో వాణిజ్యలోటు 32 శాతంగానే ఉంది. విలువలో మాత్రం 83.1 బిలియన్‌ డాలర్లు. అయితే గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ తన వాణిజ్య భాగస్వామ్య దేశాలతో పోల్చితే... చైనాతోనే అత్యధిక వాణిజ్యలోటును కలిగి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ మాట్లాడుతూ, భారతదేశం దృష్టి కేవలం చైనాతో మొత్తం వాణిజ్య లోటుపై ఉండకూడదని, కొన్ని క్లిష్టమైన  ఉత్పత్తుల కోసం బీజింగ్‌పై  దేశం ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రధాన లక్ష్యం ఉండాలని అన్నారు.  

చైనాతో భారత్‌ వాణిజ్య తీరిది... 
2021 భారత్‌–చైనా మధ్య వస్తు ఎగుమతి–దిగుమతి గణాంకాల ప్రకారం.. భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్‌ గూడ్స్‌ భారత్‌ దిగుమతుల విలువ 47 బిలియన్‌ డాలర్లుగా ఉంది. తర్వాతి స్థానంలో ఇంటర్మీడియట్‌ వస్తువులు (30 బిలియన్‌ డాలర్లు), వినియోగ వస్తువులు (9.4 బిలియన్‌ డాలర్లు), ముడి పదార్థాలు ( బిలియన్‌ డాల ర్లు) ఉన్నాయి. ఇక భారత్‌ 11 బిలియన్‌ డాలర్ల ఇంటర్మీడియట్‌ వస్తువులను  చైనాకు ఎగు మతి చేసింది.  

తరువాతి స్థానంలో ముడి పదార్థాలు (6 బిలియన్‌ డాలర్లు), వినియోగ వస్తువులు (3.4 బిలియన్‌ డాలర్లు),  క్యాపిటల్‌ గూ డ్స్‌ (2.4 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. వెరసి చైనాతో వాణిజ్యలోటు క్యాపిటల్‌ గూడ్స్‌కు సంబంధించి 45 బిలియన్‌ డాలర్లు, ఇంటర్మీడియట్‌ గూడ్స్‌కు సంబంధించి 19 బిలియన్‌ డాలర్లు, వినియోగ వస్తువుల విషయంలో 6 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement