Raisina Dialogue: అన్నీ అమ్మేసే తొందరేమీ లేదు..

Nirmala Sitharaman at Raisina Dialogue - Sakshi

డిజిన్వెస్ట్‌మెంట్‌పై నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ (పీఎస్‌ఈ) హడావిడిగా వాటాలు విక్రయించేయాలన్న తొందరలో ప్రభుత్వమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. టెలికం సహా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైజినా డైలాగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.

పీఎస్‌ఈ పాలసీ ప్రకారం అటామిక్‌ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలికం; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల విభాగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ‘అన్నీ హడావిడిగా అమ్మేసేయాలన్న తొందర్లో ప్రభుత్వం లేదు. అలాగే గుండుసూదుల నుంచి పంటల దాకా ప్రతి వ్యాపారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందనీ ఈ పాలసీలో ఏమీ లేదు. కాబట్టి తన అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు.

కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో.. ఉదాహరణకు టెలికం వంటి వాటిల్లో ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రొఫెషనల్‌గా నడిచే ఒక టెలికం కంపెనీ ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోనూ తమంతట తాము నిలదొక్కుకోగలిగేంత పెద్ద సంస్థల్లో ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె వివరించారు. అలా కాకుండా మరీ చిన్నవి.. నిలదొక్కుకోలేనివి ఉంటే వాటిని పెద్ద సంస్థల్లో విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.  

కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని భావించింది. కానీ దీన్ని తర్వాత రూ. 50,000 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్‌లో దాన్ని కాస్త స్వల్పంగా పెంచుతూ రూ. 51,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top