అందుకే కొనను: అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్‌ గుట్టు విప్పిన బిలియనీర్‌

Nikhil Kamath Indias youngest billionaire does not buy ultra luxury brands - Sakshi

అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్‌ గుట్టు విప్పారు ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ (Nikhil Kamath). భారతదేశ యంగెస్ట్‌ బిలియనీర్ అయిన ఆయన.. తన పాడ్‌కాస్ట్ 'WTF ఈజ్ విత్ నిఖిల్ కామత్' తాజా ఎపిసోడ్‌లో మాట్లాడుతూ తాను అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్‌ కొనడం ఆపేనట్లు చెప్పారు. 

హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్‌ల మార్కెటింగ్ వ్యూహాన్ని నిఖిల్‌ కామత్‌ తప్పుపట్టారు. అది ఒకరకంగా కస్టమర్లను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. అల్ట్రా-లగ్జరీ బ్రాండ్‌లు కస్టమర్‌లకు ఉత్పత్తిని నేరుగా విక్రయించకుండా "సంబంధాన్ని పెంచుకునేలా" చేస్తాయన్నారు. అంతిమంగా కస్టమర్లకు ఉత్పత్తులు చేరేలోపు వారిని రకరకాల ఛట్రాల్లో ఇరికిస్తాయన్నారు. ఇదంతా తమ ఉత్పత్తులకు విలువను పెంచుకునే ఎత్తుగడలో భాగమేనన్నారు.

“గత 3-4 సంవత్సరాలుగా నేను హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్‌ల ఉత్పత్తులు కొనడం పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే వారు కస్టమర్లతో ఆడుకుంటున్నారు.  కస్టమర్లను ఊరించి ఫలితం పొందడమే వారి మార్కెటింగ్ వ్యూహం” అని కామత్ తన పోడ్‌కాస్ట్‌లో అన్నారు.

తప్పుడు వ్యూహం!
ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అహంకారంతో కూడిన వ్యూహంగా నిఖిల్‌ కామత్‌ భావిస్తున్నారు. “వారు ఈ బ్యాగ్‌లు, వస్తువులను మిలియన్ల కొద్దీ తయారు చేయగలరు. కానీ అహంకారంతో కూడిన వ్యూహంతోనే ఇలా పరిమితంగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కస్టమర్లు దీన్ని గమనించాలి” అన్నారు.

హెర్మేస్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్‌లు వాటి ప్రత్యేకత, పరిమిత లభ్యతకు ప్రసిద్ధి చెందాయి. కస్టమర్లు హెర్మేస్ హ్యాండ్‌బ్యాగ్‌ను కొనుగోలు చేయాలంటే ముందుగా అనేక చిన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top