ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు | NHAI Announces Revised FASTag Annual Pass Rates Effective April 1 2026 | Sakshi
Sakshi News home page

ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు

Mar 20 2026 3:10 PM | Updated on Mar 20 2026 3:16 PM

NHAI Announces Revised FASTag Annual Pass Rates Effective April 1 2026

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ​కీలక అప్‌డేట్‌ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.

కొత్త ధరల వివరాలు

ప్రస్తుతం చలామణిలో ఉన్న వార్షిక పాస్ ధర రూ.3,000 ఉండగా దీన్ని రూ.3,075కు పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. అంటే నేరుగా రూ.75 భారం పడనుంది. నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ధారణ, వసూలు) నిబంధనలు, 2008 ప్రకారం ఈ వార్షిక ధరల సవరణ జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

వార్షిక పాస్ ప్రయోజనాలు.. నిబంధనలు

ఈ వార్షిక పాస్ ముఖ్యంగా తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌వేలు (ఉదాహరణకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వంటివి) ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.

పాస్ ఎలా పొందాలి?

వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్‌కే ఈ వార్షిక పాస్‌ను లింక్ చేసుకోవచ్చు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ వార్షిక పాస్ సేవలను వినియోగించుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement