మార్కెట్లో న్యూఏజ్‌ టెక్‌ షేర్ల వెల్లువ.. జాబితాలో పేటీఎం, జొమాటో, నైకా

New Age Tech Shares In Stock Market Paytm Zomato Nykaa - Sakshi

గత కొద్ది నెలలుగా పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చి స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన పలు కొత్తతరం(న్యూఏజ్‌) టెక్‌ కంపెనీల షేర్లు కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఐపీవోకు ముందు కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థల షేర్లపై లాకిన్‌ గడువు తీరనుండటం కారణమవుతోంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవోకు ముందు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లేదా 20 శాతానికి మించిన ప్రమోటర్ల వాటాకు లాకిన్‌ గడువును ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వివరాలు చూద్దాం..  

గతేడాది నవంబర్‌ మొదలు ఈ ఏడాది మే నెలవరకూ పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చిన పలు న్యూఏజ్, ఫిన్‌టెక్‌ కంపెనీలు, స్టార్టప్‌ల షేర్లకు లాకిన్‌ గడువు ఈ నెలలో ముగియనుంది. 12 నెలల నుంచి 6 నెలల గడువు తీరనుండటమే దీనికి కారణం. నేటి నుంచి క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ షేర్లు అందుబాటులోకి రానుండగా.. ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ షేర్లకు రేపు(10న) లాకిన్‌ గడువు తీరనుంది. ఈ జాబితాలో ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌(12న), పీబీ ఫిన్‌టెక్‌(15న), పేటీఎమ్, శాఫైర్‌ ఫుడ్స్‌(18న), డెల్హివరీ(24న), టార్సన్‌ ప్రొడక్ట్స్‌(26న) పారదీప్‌ ఫాస్ఫేట్స్‌(27న), గో ఫ్యాషన్‌ ఇండియా(30న) తదితరాలున్నాయి.

దీంతో ఈ షేర్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలను తాకనున్నాయి. వెరసి పలు కంపెనీల కౌంటర్లలో అందుబాటులోని ఈక్విటీ ఒక్కసారిగా పెరగనుంది. అయితే నైకా, రెయిన్‌బో చిల్డ్రన్స్, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్, శాఫైర్‌ ఫుడ్స్, గోకలర్స్‌ తదితర కొన్ని కౌంటర్లు ఐపీవో ధరతో పోలిస్తే భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐపీవోకు ముందు ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు ఆయా షేర్లను విక్రయించేందుకు ఆసక్తి చూపేదీ లేనిదీ వేచి చూడవలసి ఉన్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు.  

జొమాటో ఎఫెక్ట్‌ 
ఈ ఏడాది జులైలో లాకిన్‌ గడువు ముగిసిన వెంటనే జొమాటో షేర్లు జులైలో 22 శాతం పతనంకావడం గమనార్హం. ప్రీఐపీవో ఇన్వెస్టర్లు ఉబర్, టైగర్‌ గ్లోబల్‌ తదితరాలు షేర్లను విక్రయించడం ప్రభావం చూపింది. ఒక అంచనా ప్రకారం 14 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 1,15,000 కోట్లు) విలువైన షేర్లకు లాకిన్‌ గడువు తీరనుంది. వీటిలో నైకా 31.9 కోట్ల షేర్లు, పాలసీ బజార్‌ 2.8 కోట్ల షేర్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దీంతో పలు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పేటీఎమ్‌ షేరు ఐపీవో ధరతో పోలిస్తే 70 శాతం పతనంకాగా.. గత నెల రోజుల్లోనే డెల్హివరీ 35 శాతం, పీబీ ఫిన్‌టెక్‌ 26 శాతం, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ 21 శాతం చొప్పున డీలా పడ్డాయి.

చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top