సిల్వర్‌ ఈటీఎఫ్‌లకు ఏఎంసీలు సుముఖం

Mutual funds flock to silver ETF space with new schemes - Sakshi

ఈ ఏడాది రూ.1,400 కోట్లు సమీకరణ

ఈటీఎఫ్‌ల ఆవిష్కరణకు పలు సంస్థల సన్నాహాలు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) వరుసబెట్టి సిల్వర్‌ ఈటీఎఫ్‌లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి రూ.1,400 కోట్లను సమీకరించాయి. సిల్వర్‌ ఈటీఎఫ్‌ల ఆవిష్కరణకు సెబీ గతేడాది నవంబర్‌లో అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఏఎంసీలు సిల్వర్‌ ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ల ప్రారంభానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. కోటక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయితే, సిల్వర్‌ ఈటీఎఫ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది.

ఈ ఫండ్స్‌తో వెండిపై డిజిటల్‌గా పెట్టుబడులకు వీలు కలుగుతుంది. ఆదిత్య బిర్లా మ్యూచువల్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్, నిప్పన్‌ ఇండియా సంస్థలు సిల్వర్‌ ఈటీఎఫ్‌లను ప్రారంభించాయి. ఈ సంస్థలన్నీ కూడా సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ద్వారా సమీకరించిన నిధులను తీసుకెళ్లి తమ నిర్వహణలోని సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో ఇవి ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇక డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ల ఎన్‌ఎఫ్‌వో(నూతన పథకం)లు ఇటీవలే ముగిశాయి. ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఎఫ్‌వోఎఫ్‌లు ప్రస్తుతం నిధుల సమీకరణలో ఉన్నాయి.

హెడ్జ్‌ సాధనంగా..
‘‘ద్రవ్యోల్బణానికి హెడ్జ్‌ సాధనంగా చాలా మంది ఇన్వెస్టర్లు వెండిలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వీరికి సిల్వర్‌ ఈటీఎఫ్‌లు మంచి అవకాశంగా ఉన్నాయి. భౌతికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌గా కలిగి ఉండొచ్చు’’అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ కవిత కృష్ణన్‌ తెలిపారు. పైగా ఇటీవలి కాలంలో వెండి ధరలు తగ్గి ఉండడం కూడా ఏఎంసీలు ఈటీఎఫ్‌లు, ఎఫ్‌వోఎఫ్‌ల ఆఫర్లను ప్రారంభించడానికి కారణంగా ఆమె పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల తరుణంగా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు తోడు, పారిశ్రామిక, తయారీ రంగాల్లోనూ దీని వినియోగం పెరిగినట్టు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్, 5జీ రంగాల నుంచి డిమాండ్‌ నెలకొన్నట్టు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top