‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’ | Meta CEO Zuckerberg Admits AI Mistakes Says No Major Layoffs Expected in 2026 | Sakshi
Sakshi News home page

‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’

Jun 13 2026 10:14 PM | Updated on Jun 14 2026 1:08 PM

Meta CEO Zuckerberg Admits AI Mistakes Says No Major Layoffs Expected in 2026

సోషల్ మీడియా దిగ్గజం మెటా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగాయని దాని అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అంగీకరించారు. అంతర్గత మెమోలో ఉద్యోగులను ఉద్దేశించి, వేగంగా మారుతున్న ఏఐ ప్రపంచంలో ఇలాంటి సవాళ్లు సహజమని  జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. “ఈ మార్పుల సంక్లిష్టత దృష్ట్యా మేము తప్పులు చేశాం. భవిష్యత్తులో కూడా కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మెటా సంస్థ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా ఏఐ చుట్టూ పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు, సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో సంస్థలో విస్తృత స్థాయి పునర్నిర్మాణం చేపట్టింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బృందాలకు బదిలీ చేసింది.

అయితే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో జుకర్‌బర్గ్ కీలక హామీ ఇచ్చారు. “ఈ ఏడాది సంస్థవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయి ఉద్యోగ కోతలు ఉంటాయని మేము భావించడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున అతిగా హామీలు ఇవ్వలేనప్పటికీ, సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఏఐ మోడళ్ల శిక్షణ కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అవసరమైతే కొన్ని విభాగాల్లో తగ్గించిన సిబ్బందిని తిరిగి ఇతర బృందాలకు మార్చే అవకాశమూ ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, మెటాలో జరిగిన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఏఐ విభాగాల్లో పని స్వరూపం, బాధ్యతలపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జూలైలో భారీ ఏఐ హ్యాకథాన్‌, టీమ్‌ ఈవెంట్లు నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఏఐ పోటీలో ముందంజలో నిలవాలన్న లక్ష్యంతో మెటా దూసుకెళ్తున్నప్పటికీ, ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, సంస్థాగత మార్పులను సమతుల్యం చేయడం కంపెనీకి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement