ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే? | Maruti Suzuki WagonR Flex Fuel Price Rs 86000 And Know The Details | Sakshi
Sakshi News home page

ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే?

Jun 15 2026 2:40 PM | Updated on Jun 15 2026 2:50 PM

Maruti Suzuki WagonR Flex Fuel Price Rs 86000 And Know The Details

భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఇది ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కంపెనీ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన సమయంలో ధరలను ప్రకటించలేదు. అయితే తాజాగా సంస్థ ఈ వాహనం ధరను రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది.

వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ ZXi+ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. అయితే ధర మాత్రం జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌ కంటే రూ. 86,000 ఎక్కువ.

వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుంది. అంటే ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నప్పటికీ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది. అంతేకాకుండా.. చెరకు వంటి పంటల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

ఇదీ చదవండి: హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్‌లు

అయితే.. ఈ వాహనం ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. కమర్షియల్ విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యాగన్ ఆర్ టూర్ H3తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న 1.2 లీటర్ ఇంజిన్ మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. టూర్ H3లో 1.0 లీటర్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.

పనితీరు విషయానికి వస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌లో పవర్ లేదా టార్క్ పరంగా ఎటువంటి పెరుగుదల లేదు. ఈ 1.2 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 90.9 హార్స్‌పవర్, 113.7 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement