Maruti Suzuki: ఇంధనం ఆదా చేసే కార్లకే ప్రాధాన్యం

Maruti Suzuki Kam Se Kaam Banega Campaignfor Focusing On Fuelefficient Cars - Sakshi

న్యూఢిల్లీ: పనితీరుపై రాజీపడకుండా ఇంధనాన్ని మరింత ఆదా చేసే వాహనాల తయారీపైనే ఇకపైనా దృష్టి పెడతామని దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. కొనుగోలుదారులు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని ఆయన వివరించారు.

పర్యావరణ హితమైన, ఇంధనం ఆదా చేసే విధమైన కార్లకు మారుతీ కట్టుబడి ఉందని తెలియజేసే కమ్‌ సే కామ్‌ బనేగా (కాస్త ఇంధనం సరిపోతుంది) పేరిట కొత్త ప్రచార కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. ఇంధన ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలేమీ కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో కస్టమర్లు మెరుగైన మైలేజీనిచ్చే వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపవచ్చని ఆయన పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నుంచి మరింత కఠినతరమైన కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలూ ఇంధనం ఆదా చేసే వాహనాలను తప్పనిసరిగా తయారు చేయాల్సి రాగలదని శ్రీవాస్తవ చెప్పారు. స్మార్ట్‌ హైబ్రిడ్, ఎస్‌–సీఎన్‌జీ, కె–సిరీస్‌ ఇంజిన్లు మొదలైన వినూత్న సాంకేతిక ఆవిష్కరణల ఊతంతో గడిచిన దశాబ్ద కాలంలో తమ వాహనాల సామర్థ్యాన్ని దాదాపు 30% దాకా మెరుగుపర్చామని ఆయన తెలిపారు. 

‘ఇంధనం ఆదా చేసే కార్లకు సంబంధించి మేము వివిధ విభాగాల్లో లీడర్లుగా ఉన్నాం. ఆల్టో, వ్యాగన్‌ ఆర్, బాలెనో స్మార్ట్‌ హైబ్రిడ్, డిజైర్, సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఈకో తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి‘ అని శ్రీవాస్తవ చెప్పారు. అధిక మైలేజీ, మెరుగైన పనితీరుకు పేరొందిన కే–సిరీస్‌ ఇంజిన్లు అమర్చిన కార్లు 70 లక్షలకు పైగా విక్రయించామని చెప్పారు.

చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top