లోకలైజేషన్‌ పెరగాలి

Maruti Suzuki Chairman Kenichi Suggests Auto Parts Companies - Sakshi

టెక్నాలజీపై పెట్టుబడులు పెంచాలి

ఆటో విడిభాగాల సంస్థలకు మారుతీ సుజుకీ చైర్మన్‌ కెనిచి సూచన

న్యూఢిల్లీ: వాహన విడిభాగాల పరిశ్రమ స్థానికీకరణ (లోకలైజేషన్‌) పెంచడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కెనిచి అయుకావా అభిప్రాయపడ్డారు. నిలకడైన వృద్ధి సాధించేందుకు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచడాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 62వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అయుకావా ఈ విషయాలు తెలిపారు.

‘ముడి వస్తువులు మొదలుకుని అత్యంత చిన్న విడిభాగాలను కూడా వీలైనంత వరకూ స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు మార్గాలు వెతకాలి. భారతీయ ఆటో పరిశ్రమ దేశీయంగాను, అటు ఎగుమతులపరంగానూ భారీ స్థాయికి పెరిగింది. ఇలాంటప్పుడు నాణ్యత అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.

2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ప్రధాని లక్ష్యం సాకారం చేసే దిశగా భవిష్యత్‌ తరం టెక్నాలజీలపై పరిశ్రమ ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమను తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఏసీఎంఏ, వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ కలిసి పనిచేయాలని అయుకావా తెలిపా రు. కాగా, ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అమ్మకాలు కరోనా పూర్వ స్థాయికి చేరగా.. ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా ఈ పండుగ సీజన్‌లో ఆ స్థాయిని అందుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ సంజయ్‌ కపూర్‌ చెప్పారు.

వాహనాల పరీక్షకు కఠిన ప్రమాణాలు ఉండాలి: పవన్‌ గోయెంకా 
ఎలక్ట్రిక్‌ వాహనాలను కంపెనీలు ఆదరాబాదరాగా మార్కెట్లోకి తెచ్చేయకుండా తయారీకి సంబంధించి కఠిన ప్రమాణాలు, పరీక్షలు ఉండాలని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ చైర్మన్‌ పవన్‌ గోయెంకా అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్‌ వాహనాలు అగ్ని ప్రమాదాల బారిన పడే ఉదంతాలను నివారించవచ్చని పేర్కొన్నారు. 

కఠిన చర్యలు..
సరఫరాదారులు విడిభాగాలను స్థానికంగా తయారు చేయకుండా అడ్డుపడే ఆటోమొబైల్‌ కంపెనీల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశీయంగానే విడిభాగాలను తయారు చేసుకోవడానికి పరిశ్రమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం.
– పీయూష్‌ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top