
తయారీతో పాటు ఏడు రంగాలపై ప్రభావం
ఏఐ, రోబోటిక్స్ సహా కీలకంగా నాలుగు సాంకేతికతలు: డబ్ల్యూఈఎఫ్ నివేదిక
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో నాలుగు కొత్త టెక్నాలజీలు అంతర్జాతీయంగా ఉద్యోగాల మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ ఎనర్జీ సిస్టమ్స్, సెన్సార్ నెట్‌వర్క్స్ వీటిలో ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఉద్యోగులు పని చేసే ఏడు కీలక రంగాలపై వీటి ప్రభావం గణనీయంగా ఉండనుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వ్యవసాయం, తయారీ, నిర్మాణం, హోల్‌సేల్..రిటైల్ వాణిజ్యం, రవాణా.. లాజిస్టిక్స్, బిజినెస్..మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మొదలైనవి ప్రభావిత రంగాల జాబితాలో ఉంటాయి.
నవీన టెక్నాలజీలతో ఈ రంగాల్లో ఉత్పాదకత పెంచుకునేందుకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఉత్పాదకతను పెంచుకోవాలంటే, రిసు్కలను అదుపులో ఉంచుకోవాలంటే ప్రభుత్వాలు, పరిశ్రమ, డెవలపర్లు సమష్టిగా పని చేయాల్సి రానుంది. పెట్టుబడుల కోసం మూలధనాన్ని సమకూర్చుకోవడం, గ్లోబల్‌గా టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత స్థాయిలో పెంచడం, అందరికీ సాంకేతికత అందుబాటులోకి వచ్చేలా చూడటంలాంటి అంశాలు కీలకంగా ఉంటాయని నివేదిక వివరించింది.
‘ఇప్పుడు, రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలపై భవిష్యత్తులో టెక్నాలజీ బాటను నిర్దేశిస్తుంది. సానుకూల ఫలితాలను సాధించాలంటే, ఏయే టెక్నాలజీలు, ఏడు కీలక రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం‘ అని డబ్ల్యూఈఎఫ్ హెడ్ టిల్ లియోపాల్డ్ తెలిపారు.
నివేదికలో మరిన్ని అంశాలు..
⇒ డెస్క్ ఉద్యోగాల్లోనే కాకుండా ఇతరత్రా కొలువుల్లోనూ కొత్త టెక్నాలజీలు గణనీయంగా మార్పులు తెస్తున్నాయి. డ్రోన్ టెక్నాలజీతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పట్టణ ప్రాంతాల్లో డెలివరీలు చేస్తుండగా, ఘనా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరికరాలను చేరవేస్తున్నారు.
⇒ పలు ఆఫ్రికన్ దేశాల్లో రూఫ్‌టాప్ పునరుత్పాదక విద్యుత్ సిస్టమ్‌లు అందుబాటులోకి రావడంతో, కరెంటు కోతల వల్ల సిబ్బందిని ఇంటికి పంపించివేయాల్సిన పరిస్థితి తగ్గుతోంది. దీంతో పని వేళల్లో స్థిరత్వం వచి్చంది. అలాగే ఈ విద్యుత్ వ్యవస్థను నిర్వహించే నిపుణులకు డిమాండ్ ఏర్పడింది.
⇒ విద్యుదుత్పత్తి, నిల్వ చేసే టెక్నాలజీలు ఇటు హోల్‌సేల్ అటు రిటైల్ వ్యాపార సిబ్బంది పనితీరును కూడా మెరుగుపరుస్తున్నాయి. దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత్‌లాంటి దేశాల్లో టోకు వర్తకులు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలను ఉపయోగిస్తూ కరెంటు కోతలను అధిగమిస్తున్నారు. డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో ఎనర్జీ సిస్టం మానిటరింగ్, రిఫ్రిజిరేషన్ మేనేజ్‌మెంట్‌లాంటి విభాగాల్లో కొలువులు ఏర్పడుతున్నాయి.
⇒ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారంలో క్లిక్–అండ్–కలెక్ట్ (ఆన్‌లైన్‌లో ఆర్డరు పెట్టి, పికప్ పాయింట్‌లో సరుకులు తీసుకోవడం) ప్రక్రియలో ఏఐని వినియోగిస్తుండటం వల్ల ఆఫ్రికా, భారత్, లాటిన్ అమెరికాలో ఉద్యోగాల స్వరూపంలో మార్పులు వస్తున్నాయి.
⇒ సెమీ–ఆటోమేటెడ్ నిర్మాణ యంత్రాల వల్ల ఉద్యోగులకు శారీరక శ్రమ భారం తగ్గి, భద్రత పెరుగుతోంది. ఏఐ డేటా ప్రాసెసింగ్‌తో రోబోటిక్స్‌ను జతపరిస్తే హెల్త్‌కేర్ రంగంలో పేషంట్ల చికిత్స, ఉద్యోగుల పనితీరు విధానాల్లో సరికొత్త మార్పులు తీసుకురావచ్చు.