
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్ బాబు
కొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్ పరిమితిని సీనియర్, నాన్ సీనియర్ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్ వర్తించదు. నాన్ సీనియర్ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి.
ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!
మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉష
మార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్