లండన్‌లో మ్యాక్రోటెక్‌ విక్రయాలు

Macrotech Developers sells properties worth Rs 1,900 crore in London - Sakshi

రూ. 1,900 కోట్ల విలువైన బుకింగ్స్‌

న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో లండన్‌లో రూ. 1,900 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించినట్లు వెల్లడించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రెండు ప్రాజెక్టుల నుంచి తాజా అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. దేశీయంగా లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను అభివృద్ధి చేసే కంపెనీ యూకే ప్రాజెక్టుల ద్వారా ఒక త్రైమాసికంలో తొలిసారి 19.1 కోట్ల పౌండ్ల(రూ. 1,900) అమ్మకాలు అందుకున్నట్లు వెల్లడించింది.

2013లో కెనడా ప్రభుత్వం నుంచి 30 కోట్ల పౌండ్ల(రూ. 3,100 కోట్లు)కు మ్యాక్‌డొనాల్డ్‌ హౌస్‌ను కొనుగోలు చేయడం ద్వారా మ్యాక్రోటెక్‌.. లండన్‌ ప్రాపర్టీ మార్కెట్లో ప్రవేశించింది. లోధా డెవలపర్స్‌ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ తదుపరి 2014లో 9 కోట్ల పౌండ్లకు న్యూ కోర్టు స్థలాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ గత రెండు త్రైమాసికాల్లో సాధించిన పటిష్ట బుకింగ్స్‌తో రానున్న నాలుగు నెలల్లోగా 22.5 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటి గడువు 2023 మార్చికాగా.. అంతకంటే ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
బీఎస్‌ఈలో మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ షేరు స్వల్ప లాభంతో రూ. 1,238 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top