భారత్‌ మార్కెట్‌పై ఎల్‌జీ ఫోకస్‌  | LG focuses on the Indian market | Sakshi
Sakshi News home page

భారత్‌ మార్కెట్‌పై ఎల్‌జీ ఫోకస్‌ 

Jun 13 2026 5:40 AM | Updated on Jun 13 2026 5:40 AM

LG focuses on the Indian market

సౌదీ అరేబియా, బ్రెజిల్‌కూ ప్రాధాన్యం 

2030 నాటికి రెట్టింపు ఆదాయ లక్ష్యం 

ఏఐ ఆధారిత స్మార్ట్‌ ఉత్పత్తులు 

శ్రీ సిటీ ప్లాంట్‌ నుంచి ఎగుమతులు 

సంస్థ సీఈవో జే చియోల్‌ ప్రకటన 

సియోల్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ తన భవిష్యత్‌ వ్యాపార వృద్ధికి భారత్‌ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్‌తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్‌ మార్కెట్ల నుంచి  ఆదాయాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ సీఈవో ల్యూ జే చియోల్‌ తెలిపారు. 

ముఖ్యంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్‌ కూడా కావడంతో.. ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్ల (ఏసీలు) వినియోగం ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఎల్‌జీ బ్రాండ్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై ఎల్‌జీ దృష్టి సారించింది. వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌ కండీషనర్లు, కిచెన్‌ ఉత్పత్తుల్లో ఏఐతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. 

ఎగుమతులకూ ప్రాధాన్యం.. 
2025లో భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్‌ దేశాల నుంచి ఎల్‌జీకి 6.2 ట్రిలియన్‌ కొరియన్‌ వోన్‌ల ఆదాయం లభించగా, 2023తో పోలిస్తే ఇది 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది సంస్థ మొత్తం ఆదాయం 89.2 ట్రిలియన్‌ వోన్‌ల్లో 8 శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌జీ సంస్థ సాధించిన వృద్ధితో పోలి్చతే ఇది రెండింతలకుపైగా కావడం విశేషం. ఇంత భారీ వృద్ధి అవకాశాల నేపథ్యంలో భారత్‌ను ‘గ్లోబల్‌ సౌత్‌’ వ్యూహానికి కేంద్రబిందువుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు ఎల్‌జీ వెల్లడించింది. 

ప్రస్తుతం ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో ప్లాంట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది 2026 చివరినాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్‌ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. యూకే, ఈయూతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా, వీటిని అనుకూలంగా చేసుకోవడాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది.  

ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి
ప్రస్తుతం భారత్‌లో మధ్యస్థ, తక్కువ ధరల ఉత్పత్తుల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఎల్‌జీ, ఇకపై నాలుగు డోర్ల ఫ్రిజ్‌లు, ఫ్రెంచ్‌ డోర్‌ ఫ్రిజ్‌లు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీని పెంచనున్నట్టు వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, స్థానిక సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీన అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు పేర్కొంది. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్‌ కండీషనింగ్‌ (హెచ్‌వీఏసీ) విభాగంలోకీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. భారత వినియోగదారులు సాధారణ ఉత్పత్తుల కంటే ఇంటెలిజెంట్, కనెక్టెడ్‌ (ఒకదానితో ఒకటి అనుసంధానిత) గృహోపకరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు ఆధారిత గృహోపకరణాలు, వాటిని అనుసంధానించే స్మార్ట్‌ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement