రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు | Sakshi
Sakshi News home page

రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు

Published Tue, Aug 8 2023 6:20 AM

ITRs filed between April-June 2023 nearly doubles to 1. 36 crore - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల కాలంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాఖలయ్యాయి. ఆడిటింగ్‌ అవసరం లేని రిటర్నుల దాఖలుకు (వ్యక్తులు) గడువు జూలై 31తో ముగిసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొత్తం 1.36 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక రిటర్నుల దాఖలుకు చివరి నెల జూలైలో మొత్తం 5.41 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి.

దీంతో ఏప్రిల్‌ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2022లో ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్‌లో 70.34 లక్షల రిటర్నులు దాఖలు కాగా, 2023 ఏప్రిల్‌–జూన్‌ మధ్య 1.36 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. ఈ ఏడాది అధిక సంఖ్యలో రిటర్నులు దాఖలు కావడానికి సోషల్‌ మీడియా ప్రచారం, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్‌ ద్వారా రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది.

పెరిగిన కోటీశ్వరులు
రూ.కోటికి పైన ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022 మార్చితో ముగిసిన రెండేళ్ల కాలంలో రెట్టింపై 1.69 లక్షలకు చేరింది. 2022–23 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో మొత్తం 1,69,890 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం చూపించారు. 2021–22 అసెస్‌మెంట్‌ సంవత్సరం (ఏవై) రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం పేర్కొన్న వారు 1,14,446 మంది ఉన్నారు.

2020–21 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో వీరి సంఖ్య 81,653గానే ఉంది. 2022–23 ఏవైలో వ్యక్తులు, కంపెనీలు, ట్రస్ట్‌లు, సంస్థలు ఇలా అన్ని వర్గాలూ కలసి రూ.కోటికి పైన ఆదాయం వెల్లడించిన వారి సంఖ్య 2.69 లక్షలుగా ఉంది. 2022–23 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2021–22లో ఏవైలో 7.14 కోట్లు, 2020–21 ఏవైలో 7.39 కోట్ల చొప్పున రిటర్నులు వచ్చాయి. 

Advertisement
Advertisement