ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట | Sakshi
Sakshi News home page

ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట

Published Wed, Sep 27 2023 10:19 PM

IT industry is expecting mild recession due to reduction in uncertainty - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఐటీ పరిశ్రమంలో పని చేస్తున్న టెక్‌ ఉద్యోగుల్లో ఉంది. అయితే ఈ భయంపై ఊరట కలిగించే మాటను గ్లోబల్ డేటా స్టోరేజ్ అండ్‌ సొల్యూషన్స్ మేజర్ నెట్‌యాప్‌ (NetApp) సీఈవో జార్జ్ కురియన్ (George Kurian) చెప్పారు.

భారత్‌.. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని నెట్‌యాప్‌ అంచనా వేస్తోంది. దేశ ఆర్థిక బలం, పెరుగుతున్న యువ జనాభా ఇందుకు దోహం చేస్తాయని భావిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశంలో 20 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసిన ఈ సంస్థ, దేశంలో భాగస్వామ్యాలను, హెడ్‌కౌంట్‌ను విస్తరించడాన్ని కొనసాగిస్తుందని సీఈవో జార్జ్ కురియన్ పేర్కొన్నారు. 

తేలికపాటి మాంద్యం
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి స్థాయి తగ్గడంతో ఐటీ పరిశ్రమలో తేలికపాటి మాంద్యం ఉండొచ్చని తెలిపారు. సంవత్సరం క్రితంతో పోలిస్తే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వడ్డీ రేటు పెరుగుదల వేగం మందగించడం వల్ల అనిశ్చితి స్థాయి కొద్దిగా తగ్గింది. బిజినెస్‌ సెంటిమెంట్లు ఇప్పటికే వేగవంతమయ్యాయని చెప్పను కానీ విశ్వాసం మెరుగుపడటం ప్రారంభించిందని కురియన్‌ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకపోతే అన్ని దేశాలూ మాంద్యం నుంచి బయటకు వస్తాయన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement