Policybazaar: నిబంధనల ఉల్లంఘన.. 25 లక్షలు ఫైన్

పాలసీబజార్‌కు ఐఆర్‌డీఏఐ జరిమానా
ప్రకటనల నిబంధనలు ఉల్లంఘించడంతో చర్య
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో బీమా పాలసీ సేవలను అందించే (పాలసీ అగ్రిగేటర్) పాలసీ జజార్‌కు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) రూ.24 లక్షల జరిమానా విధించింది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం పెరుగుతుందంటూ కస్టమర్లకు గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 7 మధ్య ఎస్‌ఎంఎస్‌లు పంపడం ద్వారా ప్రకటనల నిబంధనలను పాలసీబజార్ ఉల్లంఘించినట్టు ఐఆర్‌డీఏఐ గుర్తించింది. 2020 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ పాలసీల ప్రీమియం పెరుగుతోందని, ఆ లోపే పాలసీ తీసుకోవడం ద్వారా ప్రీమియంను ఆదా చేసుకోవచ్చంటూ సుమారు 10 లక్షల మంది కస్టమర్లకు పాలసీబజార్ నుంచి సందేశాలు వెళ్లినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది.
ప్రీమియం ధరలు పెరుగుతున్నాయంటూ తప్పుదోవ పట్టించడంతోపాటు, నిబం ధన 11, 9లను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ప్రీమియం పెరుగుదలపై తమకు సమాచారం అందిందని ఐఆర్‌డీఏఐ ఇచ్చిన నోటీసులకు స్పందనగా పాలసీ బజార్ తెలియజేయడం గమనార్హం. కస్టమర్లకు తాజా సమాచారం తెలియజేయడమే కానీ, తప్పుదోవ పట్టించడం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చింది.
చదవండి: వ్యక్తిగత హామీదార్లూ బాధ్యులే..!