లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా..ఇంటీరియర్‌ డిజైన్లతో నయా ట్రెండ్‌

Interior Design New Trend In New House - Sakshi

జ్యోతినగర్‌: ఇంటికి అందం ఇంటీరియర్‌ డెకరేషన్‌. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకునే వారు అందరిని ఆకట్టుకునేలా ఉండేలా డిజైన్‌ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇందుకు లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా వెనకాడడం లేదు.

దీనికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ రకాల ఇంటీరియర్‌ డిజైన్లతో నయా ట్రెండ్‌ కొనసాగుతుంది. ప్రతిఒక్కరూ స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్‌ డెకరేషన్, సీలింగ్‌ను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్‌ హోటళ్లు, పెద్ద దుకాణాలకు మాత్రమే పరిమితమయ్యే ఈ డిజైన్లు ప్రస్తుతం కొత్త ఇంటి నిర్మాణాలకు కూడా వ్యాపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాగా మారడం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖ పట్టడంతో కొత్త గృహ నిర్మాణాలకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గుర్తించిన కొందరు వ్యాపారులు పీవోపీతో వివిధ డిజైన్లలో గదులను తీర్చిదిద్దే కాంట్రాక్టులు తీసుకుంటున్నారు.

డెకరేషన్‌పై ఆసక్తి..వివిధ డిజైన్లతో ఇంటికి కొత్త కళ
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధరకాల డిజైన్లతో సీలింగ్‌లను, ఇతర పనులను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో దగ్గర ఉండి పనులు చేయించుకుంటున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా పీవోపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్‌ పేయింట్స్, టెక్షర్‌ వాల్‌ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్‌ వర్క్‌పై లామినేట్స్‌తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రస్తుతం డిజైన్‌లను బట్టి స్క్వేర్‌ ఫీట్‌ (మెటీరియల్, లేబర్‌చార్జి)కు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ధర వేస్తున్నారు. ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్‌ కోసమే సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే ఇంటీరియర్‌ ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది.

ఇంటీరియర్‌పై ఆసక్తి
గతంలో చాలామంది కొత్త ఇళ్లు నిర్మించుకునే వారు ఎక్స్‌టీరియర్‌పై ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకునేవారు ఇంటీరియర్‌ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. డిజైన్‌లకు కూడా చాలా డిమాండ్‌ ఉంది. ఇంటి యజమానుల, అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా సీలింగ్‌ డిజైన్‌లు, ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేస్తున్నాం. పీవోపీ ద్వారా చేసే డిజైన్‌లతో విద్యుత్‌ దీపాల వెలుగులో మరింత అందంగా కనిపిస్తుంది.

–ఆర్‌.సాయితేజ, ఇంటీరియర్‌ డిజైనర్‌

జిల్లాలో ఆర్డర్లు వస్తున్నాయ్‌
అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో చాలా ఆర్డర్లు వస్తున్నాయి. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్‌చేసి చూపించిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో ఎక్కువ ఇంటీరియర్‌ డిజైన్లు చేయించుకునే వారు. కానీ నేడు పెద్దపల్లి జిల్లాలో చాలామంది కొత్త ఇంటిని నిర్మించుకునే వారు ఇంటీరియర్‌ డిజైన్లను కోరుకుంటున్నారు. ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్‌ చేసి అందంగా ఇంటిని ముస్తాబు చేస్తాం.       –ఎం.అక్షయ్‌కుమార్, ఇంటీరియర్‌ డిజైనర్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top