
బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన నమ్మ మెట్రో ఎల్లో లైన్ సర్వీసులకు భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మద్దతుగా నిలుస్తుంది. సుస్థిర ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి కంపెనీ ఉద్యోగులను రోడ్డు రవాణాకు బదులుగా మెట్రోలో ప్రయాణించాలని కోరింది. జయనగర్‌లోని ఆర్‌వీ రోడ్డు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా బొమ్మసంద్రను కనెక్ట్ చేసేలా 19.14 కిలోమీటర్ల ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఇటీవల ప్రారంభించారు. రోడ్డు ప్రయాణానికి సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ మెట్రో మార్గాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపించింది.
ఇదీ చదవండి: టెలికాం టారిఫ్‌లు పెంపు?
భారీ ట్రెఫిక్ జామ్‌లతో సతమవుతున్న బెంగళూరులో పలు ప్రాంతాలకు సులువుగా ప్రయాణించేలా మెట్రో సర్వీసులు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. కోనప్పన అగ్రహార స్టేషన్ తన ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌కు కీలక నోడ్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టేషన్ నుంచి ఇన్ఫోసిస్ మెట్రో ప్లాజా వరకు ప్రత్యేకమైన స్కైవాక్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇది క్యాంపస్‌కు ప్రత్యక్ష, సురక్షితమైన ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొంది. ఉద్యోగుల కోసం మెట్రో ప్లాజా వద్ద ఐడీ ఆధారిత ఎంట్రీ ప్రోటోకాల్స్ పాటించనున్నట్లు స్పష్టం చేసింది.