
ఖాతాల్లో రూ. 595 కోట్ల ఆధారం లేని నిల్వలు
ఇంటర్నల్ ఆడిట్‌లో గుర్తింపు
ఉద్యోగుల పాత్రపై అనుమానం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో మరో అకౌంటింగ్ లోపం బైటపడింది. తమ ఖాతాల్లో ‘నిర్దిష్ట ఆధారాలు లేని’ రూ. 595 కోట్ల బ్యాలెన్స్‌ను అంతర్గత ఆడిట్ విభాగం (ఐఏడీ) గుర్తించినట్లు బ్యాంక్ తెలిపింది. స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రజా వేగు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆడిట్ కమిటీ ‘ఇతర అసెట్స్’, ‘ఇతర లయబిలిటీస్’ ఖాతాల్లో లావాదేవీలపై విచారణ జరిపింది. మే 8న ఐఏడీ సమర్పించిన నివేదిక బట్టి, ‘ఇతర అసెట్స్’ కింద ఎలాంటి ఆధారాలు లేని రూ. 595 కోట్ల మొత్తం నమోదైంది.
దీన్ని జనవరిలో ‘ఇతర లయబిలిటీల’ కింద సర్దుబాటు చేసినట్లుగా రికార్డయ్యింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ. 674 కోట్లు, వడ్డీ ఆదాయం కింద ఖాతాల్లో తప్పుగా రికార్డు అయినట్లు, జనవరి 10న దీన్ని పూర్తిగా రివర్స్ చేసినట్లు బ్యాంకు వివరించింది ఈ మొత్తం వ్యవహారంలో కీలక ఉద్యోగుల పాత్రపై కూడా ఐఏడీ విచారణ జరిపినట్లు బ్యాంకు తెలిపింది. అంతర్గత విధానాలను పటిష్టం చేయడం, అవకతవకలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవడం మీద బోర్డు దృష్టి పెట్టినట్లు వివరించింది.
డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాల కారణంగా సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటూ ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సుమారు రూ. 1,979 కోట్ల మేర ఉండొచ్చని, ఈ అంశంపై దర్యాప్తు చేసిన ఏజెన్సీ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. వివిధ స్థాయిల్లో చోటు చేసుకున్న అవకతవకలను, తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఇప్పటికే సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రాజీనామా చేశారు.
కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటైంది. అకౌంటింగ్ అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు గ్రాంట్ థార్న్‌టన్‌ను బ్యాంకు నియమించుకుంది. అకౌంటింగ్‌లో అవకతవకల వార్తలతో శుక్రవారం ఉదయం బ్యాంక్ షేర్లు ఒక దశలో 6 శాతం క్షీణించినప్పటికీ తర్వాత కోలుకుని ఒక మోస్తరు లాభంతో ముగిశాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు ఉదయం సెషన్లో 5.7% క్షీణించి రూ. 735.95కి తగ్గింది. చివరికి 0.26% పెరిగి రూ. 782.30 వద్ద క్లోజయ్యింది.