Internal Audit
-
ఇండస్ఇండ్ లో మళ్లీ కలకలం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో మరో అకౌంటింగ్ లోపం బైటపడింది. తమ ఖాతాల్లో ‘నిర్దిష్ట ఆధారాలు లేని’ రూ. 595 కోట్ల బ్యాలెన్స్‌ను అంతర్గత ఆడిట్ విభాగం (ఐఏడీ) గుర్తించినట్లు బ్యాంక్ తెలిపింది. స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రజా వేగు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆడిట్ కమిటీ ‘ఇతర అసెట్స్’, ‘ఇతర లయబిలిటీస్’ ఖాతాల్లో లావాదేవీలపై విచారణ జరిపింది. మే 8న ఐఏడీ సమర్పించిన నివేదిక బట్టి, ‘ఇతర అసెట్స్’ కింద ఎలాంటి ఆధారాలు లేని రూ. 595 కోట్ల మొత్తం నమోదైంది. దీన్ని జనవరిలో ‘ఇతర లయబిలిటీల’ కింద సర్దుబాటు చేసినట్లుగా రికార్డయ్యింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ. 674 కోట్లు, వడ్డీ ఆదాయం కింద ఖాతాల్లో తప్పుగా రికార్డు అయినట్లు, జనవరి 10న దీన్ని పూర్తిగా రివర్స్ చేసినట్లు బ్యాంకు వివరించింది ఈ మొత్తం వ్యవహారంలో కీలక ఉద్యోగుల పాత్రపై కూడా ఐఏడీ విచారణ జరిపినట్లు బ్యాంకు తెలిపింది. అంతర్గత విధానాలను పటిష్టం చేయడం, అవకతవకలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవడం మీద బోర్డు దృష్టి పెట్టినట్లు వివరించింది. డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాల కారణంగా సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటూ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సుమారు రూ. 1,979 కోట్ల మేర ఉండొచ్చని, ఈ అంశంపై దర్యాప్తు చేసిన ఏజెన్సీ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. వివిధ స్థాయిల్లో చోటు చేసుకున్న అవకతవకలను, తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఇప్పటికే సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటైంది. అకౌంటింగ్ అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు గ్రాంట్ థార్న్‌టన్‌ను బ్యాంకు నియమించుకుంది. అకౌంటింగ్లో అవకతవకల వార్తలతో శుక్రవారం ఉదయం బ్యాంక్ షేర్లు ఒక దశలో 6 శాతం క్షీణించినప్పటికీ తర్వాత కోలుకుని ఒక మోస్తరు లాభంతో ముగిశాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు ఉదయం సెషన్లో 5.7% క్షీణించి రూ. 735.95కి తగ్గింది. చివరికి 0.26% పెరిగి రూ. 782.30 వద్ద క్లోజయ్యింది. -
నిగ్గు తేలుస్తారా?
⇒ చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో వాంటింగ్ ఓచర్లపై ఆరా ⇒ 12 మందిని విచారించిన జేడీ ⇒ ఇంటర్నల్ ఆడిట్‌పై కానరాని విచారణ ⇒ నోట్‌ఫైల్ లేకుండా బడ్జెట్ రిలీజ్ ఎలా చేశారో? ⇒ నేడూ దర్యాప్తు మహారాణిపేట(విశాఖ): చింతపల్లి ట్రెజరీ కుంభకోణం దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులతో పాటు గత ఐదేళ్లుగా ఈ శాఖలో జరిగిన చెల్లింపులపై ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ శివప్రసాద్ శుక్రవారం జిల్లా ఖజానాకార్యాలయంలో విచారణ చేపట్టారు. శనివారం కూడా ఇది కొనసాగుతుంది. సంబంధితశాఖ నోట్‌ఫైల్ ఆధారంగా బడ్జెట్‌ను ఆర్థికశాఖ విడుదల చేస్తుంది. కానీ ఈ కుంభకోణం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సంచలనమైన దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 2010 నుంచి 2015 మధ్య కాలంలో వైద్య,ఆరోగ్యశాఖలో కాంటాక్ట్ ఉద్యోగుల జీతాలను బినామీ పేర్లతో రూ.4 కోట్లు డ్రా చేసిన సంఘటనపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్‌ను ఆదేశించింది. 2010-15 మధ్య చింతపల్లి ఉపఖజానా కార్యాలయంలో పని చేసిన సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఎస్టీవో స్థాయి అధికారులు 12 మందిని జేడీ విచారించారు. ఆరోగ్యశాఖలో ఈ కాలంలో ఎంతమంది కాంటాక్ట్ ఉద్యోగులు పని చేశారు.. వారి అపాయింట్మెంట్ ఆర్డర్లు, జీతాల ప్లేస్లిప్లతో పాటు వారి వద్ద నుంచి వచ్చిన ఓచర్లు, వాంటింగ్ ఓచర్లపై ఆరా తీశారు. ఆ సమయంలో సూపర్విజన్ ఆఫీసర్లు ఒకొక్కరిని విడివిడిగా విచారించిన జేడీ వారి వద్ద నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. వాంటింగ్ ఓచర్లు ఎలా వస్తాయి.. వాస్తవానికి ఈ విచారణ ప్రాథమిక స్థాయిలోనే తొక్కేసి అసలు దోషులను తప్పించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయన్న వాదన ఖజానాశాఖ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నాలుగుఐదేళ్లుగా రాని వాంటింగ్ ఓచర్లు ఇప్పుడెలా వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అసలు దోషులు బయటపడడానికే అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. నోట్‌ఫైల్ లేకుండా బడ్జెట్ ఎలా.. బడ్జెట్ ఇచ్చేముందు సంబంధిత శాఖ నుంచి నోట్‌ఫైల్ ఉండాలి. దాని ఆధారంగా బడ్జెట్‌ను ఆర్థికశాఖ విడుదల చేస్తుంది. కానీ ఈ కుంభకోణం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బడ్జెట్ కోసం డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్, అకౌంట్స్ డిపార్ట్మెంట్,వైద్య ఆరోగ్యశాఖ, సంబంధిత సెక్రటేరియేట్ విభాగం సిబ్బంది కలిసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు నివేదించాలి. వారందరి ఆమోదంతోనే బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఈ కాలంలోనే బడ్జెట్ రిలీజ్లోనూ తేడాలున్నాయి. ఏడాదికి రూ. కోటి అవసరమైనప్పుడు, తర్వాత సంవత్సరం అదే డిపార్ట్మెంట్కు రూ. నాలుగు కోట్లు.. ఆ తర్వాత ఏడాది దానికి రెట్టింపు నిధులు ఎలా విడుదల చేశారన్నదానిపై విచారణ జరపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముంది. ఈ బడ్జెట్ రిలీజ్లో తేడాలెందుకున్నాయో గమనించి విచారణ చేపట్టకుండా కేవలం వాంటింగ్ఓచర్లుపై విచారణ చేపడితే లాభం ఉండదు. వాస్తవాలు బయటకు రావన్న వాదన ఉంది. దీంతోపాటు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్లు ఎలా జరిగాయి అనే కోణంలోనూ విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అసలు విషయాలు బయటకు రావాలన్నా...విచారణ పూర్తిస్థాయిలో జరగాలన్నా... పై అంశాలపై ఆరా తీస్తే బాగుంటుంది.