దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త మైలురాయి.. ఒక్క రోజులోనే సెటిల్‌మెంట్‌

Indian Stock Markets Migrating To T Plus 1 Settlement Cycle - Sakshi

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. శుక్రవారం(27న) నుంచి మొత్తం ఈక్విటీ విభాగంలో లావాదేవీలను ఒక్క రోజులోనే సెటిల్‌ చేసే ప్రక్రియకు తెరతీశాయి. దీంతో మార్కెట్లో నమోదయ్యే లావాదేవీలను మరుసటి రోజులోనే క్లియర్‌ చేస్తారు. అంటే షేరు లేదా నగదు బదిలీని పూర్తి చేస్తారు. ఈక్విటీ విభాగంలోని సెక్యూరిటీలలో ఈ నెల 27 నుంచి ట్రేడ్‌ప్లస్‌(టీప్లస్‌)1 సెటిల్‌మెంట్‌ను అమలు చేస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా పేర్కొంది.

తద్వారా దేశీ మార్కెట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకూ టీప్లస్‌2 సెటిల్‌మెంట్‌ అమల్లో ఉంది. అంటే లావాదేవీ జరిగిన రెండు రోజుల్లో క్లియరింగ్‌ను చేపడుతున్నారు. టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యాలు మెరుగుపడటంతోపాటు.. మొత్తం పరిశ్రమలో రిస్కులు తగ్గేందుకు వీలు చిక్కనుంది.  

2021లోనే పునాది: నిజానికి టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2021 సెప్టెంబర్‌ 7న గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ప్రవేశపెట్టేందుకు ఎక్సే్ఛంజీలను అనుమతించింది. ట్రేడింగ్‌ సభ్యులు, కస్టోడియన్లు తదితర మార్కెట్‌ మౌలిక సంస్థలు దశలవారీగా టీప్లస్‌1 అమలుకు తెరతీశాయి. 2022 ఫిబ్రవరి 25న కొత్త సెటిల్‌మెంట్‌ను ప్రారంభించాయి.

2023 జనవరి 27కల్లా ఈక్విటీ విభాగంలోని అన్ని సెక్యూరిటీలనూ ఒక్క రోజు సెటిల్‌మెంట్‌లోకి తీసుకువచ్చాయి. వీటిలో ఎస్‌ఎంఈ షేర్లు సహా ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌లు), రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్‌లు), సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు(ఎస్‌జీబీలు), ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్‌ బాండ్లు చేరాయి. పలు అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పటికీ టీప్లస్‌2 సెటిల్‌మెంటును అమలు చేస్తుండటం గమనార్హం!

చదవండి: జియో బంపర్‌ ఆఫర్‌.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top