జూన్‌లో ఎగుమతులు జూమ్‌!!

Indian exports during April-June rise to 95 billion US dollars - Sakshi

47 శాతం అప్, 32 బిలియన్‌ డాలర్లకు

ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతం

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, రత్నాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో జూన్‌లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 47 శాతం వృద్ధి చెంది 32.46 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. అయితే దిగుమతులు 96 శాతం పెరిగి సుమారు 42 బిలియన్‌ డాలర్లుగా నమోదు కావడంతో వాణిజ్య లోటు 9.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 జూన్‌లో 25 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు గతేడాది 22 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది జూన్‌లో వాణిజ్య మిగులు సాధించిన భారత్‌.. ఈ ఏడాది జూన్‌లో మాత్రం వాణిజ్య లోటు నమోదు చేసిందని వాణిజ్య శాఖ తెలిపింది.  

క్యూ1లో 95 బిలియన్‌ డాలర్లకు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఎగుమతులు 95 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇంజనీరింగ్, బియ్యం, మెరైన్‌ ఉత్పత్తులు మొదలైన రంగాలు మెరుగైన వృద్ధి కనపర్చడంతో ఇది సాధ్యపడిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 2018–19 జూన్‌ త్రైమాసికంలో ఎగుమతులు 82 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2020–21 ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో 51 బిలియన్‌ డాలర్లుగా, 2020–21 ఆఖరు త్రైమాసికంలో 90 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ఒక క్వార్టర్‌లో ఇంత భారీగా నమోదు కావడం ఇదే ప్రథమమని గోయల్‌ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సంబంధిత వర్గాలన్నింటితో తమ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. నిబంధనల సరళీకరణ, లైసెన్సుల పొడిగింపు తదితర అంశాలు రికార్డు స్థాయి ఎగుమతులకు దోహదపడ్డాయని గోయల్‌ చెప్పారు. మరోవైపు, సేవల రంగం ఎగుమతులు 2025 నాటికి 350 బిలియన్‌ డాలర్లకు, ఆ తర్వాత త్వరలోనే 500 బిలియన్‌ డాలర్లకు కూడా చేరవచ్చని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

గతేడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈసారి దిగుమతులు 61 బిలియన్‌ డాలర్ల నుంచి 126 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు 13 బిలియన్‌ డాలర్ల నుంచి 31 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. జూన్‌ క్వార్టర్‌లో ఇంజనీరింగ్‌ ఎగుమతుల విలువ 25.9 బిలియన్‌ డాలర్లుగా, పెట్రోలియం ఉత్పత్తులు 12.9 బిలియన్‌ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 5.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top