భారత్‌కు కెయిర్న్‌ షాక్‌..

India to take legal recourse over Cairn Energy - Sakshi

ఫ్రాన్స్‌లో భారత్‌ ఆస్తుల జప్తునకు కోర్టు నుంచి అనుమతులు

న్యూఢిల్లీ: బ్రిటన్‌ దిగ్గజం కెయిర్న్‌ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్‌ పన్నుల వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనకు రావాల్సిన పరిహారాన్ని రాబట్టుకునేందుకు ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రాన్స్‌ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కువగా ఫ్లాట్ల రూపంలో ఉన్న ఈ ప్రాపర్టీలను భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌లో తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తోంది.

వీటి విలువ సుమారు 20 మిలియన్‌ యూరోల దాకా ఉంటుందని అంచనా. తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల ఊతంతో ఆయా ప్రాపర్టీల్లో ఉన్న భారత అధికారులను కెయిర్న్‌ వెళ్లగొట్టే అవకాశాలు తక్కువే అయినా, కోర్టు ఆదేశాల కారణంగా వాటిని భారత ప్రభుత్వం విక్రయించడానికి ఉండదు. మరోవైపు, ఫ్రాన్స్‌ న్యాయస్థానం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అందిన తర్వాత చట్టపరంగా తగు పరిష్కార మార్గాలు అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.  

వివరాల్లోకి వెడితే.. కెయిర్న్‌ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్‌ఈలో లిస్ట్‌ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్‌ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్‌ ట్యాక్స్‌) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది.

దీన్ని కెయిర్న్‌ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.72 బిలియన్‌ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్‌ యోచిస్తోంది. దీనికోసం అమెరికా, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు దాఖలు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top