ఏప్రిల్‌లో రూ.53390 కోట్లు
82 శాతం పెరుగుదల
157% పెరిగిన వెండి దిగుమతులు
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 81.69 శాతం పెరిగి 5.62 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.53,390 కోట్లు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వెండి దిగుమతులు సైతం 157 శాతం పెరిగి 411 మిలియన్ డాలర్లకు (రూ.3,904 కోట్లు) చేరాయి.
అయితే, మే 13 నుంచి పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో రానున్న నెలల్లో ఇవి తగ్గుముఖం పడతాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. వెండిని పారిశ్రామిక అవసరాలకు సైతం వినియోగిస్తున్నందున సుంకం పెంపు ప్రభావం దిగుమతులపై తక్కువే ఉండొచ్చన్నారు. కాకపోతే వినియోగ ఆధారిత అవసరాలు దిగొస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొత్తం మీద యూఏఈ నుంచి పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గినట్టు చెప్పారు. యూఈఏతో మన దేశానికి వాణిజ్య ఒప్పందం ఉండడంతో అక్కడి నుంచి వచ్చే పసిడిపై సుంకాల్లో 1% రాయితీ ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) బంగారం దిగుమతులు విలువ పరంగా అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 24%పెరిగి 71.98 బిలి యన్ డాలర్లకు చేరడం గమనార్హం. పరిణామం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులుగా ఉన్నా యి. వెండి దిగుమతులు కూడా విలువ పరంగా 150% ఎగసి 12 బిలియన్ డాలర్లకు, పరిమాణంపరంగా 42%పెరిగి 7,335 టన్నులకు చేరాయి.
పుంజుకున్న వస్తు ఎగుమతులు
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అనిశి్చతుల మధ్య దేశ ఎగుమతుల రంగం ఏప్రిల్‌లో బలమైన పనితీరు చూపించింది. వస్తు ఎగుమతులు 43.56 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది నాలుగేళ్లలోనే నెలవారీ గరిష్ట రికార్డు.
→ వస్తు దిగుమతులు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 10 శాతం ఎగసి 71.94 బిలియన్ డాలర్లకు చేరాయి.
→ వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 28.38 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
→ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు 40 శాతం (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) పెరిగి 5.17 బిలియన్ డాలర్లకు చేరాయి.
→ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు సైతం 34.66 శాతం ఎగసి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
→ ఇంజనీరింగ్ ఎగుమతులు 8.76 శాతం, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు 7.12 శాతం చొప్పున పెరిగాయి.
→ యూఎస్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి ద్వారా రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో.. పశ్చిమాసియా ప్రాంతానికి ఎగుమతులు ప్రభావితమయ్యాయి. 28 శాతం తగ్గి 4.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఆ ప్రాంతం నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 31.64% తగ్గి 10.47 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్‌లో 10 శాతం క్షీణించి 18.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ సేవల ఎగుమతులు 37.24 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025 ఏప్రిల్‌లో ఉన్న 32.85 బిలియన్ డాలర్లతో పోల్చితే 14 శాతం వరకు పెరిగాయి. సేవల దిగుమతులు 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.


