దేశంలో తగ్గిన చమురు ఉత్పత్తులు

India Crude Oil Production Down 2percent In November - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అంతకంతకూ తగ్గుతోంది. నవంబర్‌లో 2 శాతం క్షీణించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడాయిల్‌ ఉత్పత్తి గతేడాది నవంబర్‌లో 2.48 మిలియన్‌ టన్నులుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 2.43 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది 2.5 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) ఉత్పత్తి 3 శాతం తగ్గి 1.6 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. ఆయిల్‌ ఇండియా ఉత్పత్తి 2,43,200 టన్నుల నుంచి 2,41,420 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య) దేశీయంగా క్రూడాయిల్‌ ఉత్పత్తి 2.74 శాతం క్షీణించి 19.86 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. దేశీయంగా ఇంధన అవసరాల కోసం భారత్‌ ఏటా 85 శాతం మేర క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు, కోవిడ్‌ దెబ్బతో కుదేలైన ఎకానమీ క్రమంగా పుంజుకుంటూ ఉండటంతో ఇంధన వినియోగం పెరిగి, రిఫైనరీల్లో ప్రాసెసింగ్‌ సైతం గణనీయంగా మెరుగుపడింది. రిఫైనరీలు .. నవంబర్‌లో 21.48 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ (గత నవంబర్‌తో పోలిస్తే 3.38 శాతం అధికం) ప్రాసెస్‌ చేశాయి. ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో ఇది 11.7% వృద్ధి చెంది 155.73 మిలియన్‌ టన్నులుగానమోదైంది.  
|
గ్యాస్‌ 23 శాతం అప్‌.. 

నవంబర్‌లో సహజ వాయువు (నేచురల్‌ గ్యాస్‌) ఉత్పత్తి 23 శాతం పెరిగి 2.86 బిలియన్‌ ఘనపు మీటర్లుగా (బీసీఎం) నమోదైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బీపీ ఆధ్వర్యంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త క్షేత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడింది. కేజీ–డీ6 నుంచి ఉత్పత్తి 1,251 శాతం ఎగిసి 581.36 బీసీఎంకి చేరగా, ఓఎన్‌జీసీ క్షేత్రాల్లో మాత్రం 5.28 శాతం క్షీణించి 1.72 బీసీఎంకి తగ్గింది. ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో గ్యాస్‌ ఉత్పత్తి 21.78 శాతం పెరిగి 22.77 బీసీఎంకి చేరింది.

చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top