
భారత్ నాలుగో అతిపెద్ద ఎకానమీ హోదాపై నీతి ఆయోగ్ సభ్యుడు విర్మానీ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో జపాన్‌ను అధిగమించి భారత్ నాలుగో స్థానాన్ని ఆక్రమించడంపై నీతి ఆయోగ్‌లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ నాలుగో స్థానానికి చేరిందంటూ నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యన్ ఇటీవల వెల్లడించగా.. ఇంకా ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ఏడాది ఆఖరు నాటికి గానీ ఆ హోదా రాదని సంస్థ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు.
ఇందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఏప్రిల్‌లో విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ (డబ్ల్యూఈవో) నివేదికను ప్రస్తావించారు. ‘భారత్ నాలుగో పెద్ద ఎకానమీగా ఎదిగే ప్రక్రియ కొనసాగుతోంది. 2025 ఆఖరు నాటికి భారత్ ఆ స్థానాన్ని తప్పకుండా దక్కించుకుంటుందని నేను వ్యక్తిగతంగా ధీమాగా ఉన్నాను. ఆ హోదాను ధ్రువీకరించుకోవడానికి మొత్తం 12 నెలల జీడీపీ గణాంకాలు అవసరమవుతాయి. అప్పటిదాకా ఇవన్నీ అంచనాలే‘ అని ఆయన చెప్పారు.
ఇక సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ‘ఇది ఒక క్లిష్టమైన విషయం. ఆయన కచి్చతంగా ఏం మాట్లాడారో, ఏం పదాలు ఉపయోగించారో నాకు తెలియదు. బహుశా ఏదైనా పదం మిస్ అయి ఉండొచ్చు లేదా ఇంకేమైనా జరిగి ఉండొచ్చు‘ అని విర్మానీ పేర్కొన్నారు.
సుబ్రహ్మణ్యం కూడా ఐఎంఎఫ్‌నే ఉటంకిస్తూ భారత్ ఇప్పుడు జపాన్‌ను దాటి నాలుగో పెద్ద ఎకానమీగా ఆవిర్భవించిందంటూ గత వారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2025లో జపాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.186 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని, భారత జీడీపీ దాని కన్నా స్పల్పంగా అధికంగా 4.187 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.