మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం! | Income Tax Act 1961 Replaced Income Tax Act 2025 Rules Effect From April 1st 2026, Major Changes Ahead For Salaried Taxpayers | Sakshi
Sakshi News home page

మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!

Mar 25 2026 8:45 AM | Updated on Mar 25 2026 10:05 AM

Income Tax Act 1961 Replaced Income Tax Act 2025 Rules 2026 Effect from April 1

దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమలు కానున్న నేపథ్యంలో వేతన జీవులు తమ పన్ను ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త చట్టం వస్తోంది కదా అని ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాత, కొత్త చట్టాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసింది.

  • 2025-26 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మీరు సంపాదించిన ఆదాయంపై పాత చట్టం (1961) ప్రకారమే పన్ను విధిస్తారు. దీనికి సంబంధించిన రిటర్నులను 2026 జూలైలో సమర్పించాల్సి ఉంటుంది.

  • 2026-27 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2026 తర్వాత సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వర్తిస్తుంది.

  • ఆటోమేటెడ్ రిటర్న్స్: తప్పులకు తావులేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.

  • ఇకపై మీ జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కంపెనీలు, బ్యాంకుల నుంచి డేటా నేరుగా సిస్టమ్‌లోకి వస్తుంది.

  • సిస్టమ్ ఆటోమేటిక్‌గా వివరాలను సేకరించినప్పటికీ ఆ సమాచారం సరైనదేనని ధ్రువీకరించే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే.

  • ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, ఫారం-26AS స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్లు రానున్నాయి.

హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులపై నిఘా

పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే విషయంలో కొత్త నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) విషయంలో యజమాని వివరాలు, పాన్ కార్డు, సంబంధిత పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది.

సీటీసీలో మార్పులు

కొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం(బేసిక్‌ పే) అతని మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఫలితంగా చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడతాయి.

కొత్త వ్యవస్థ పన్ను ఎగవేతను అరికట్టడమే కాకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, 2026 ఏప్రిల్ నుంచి ప్రతి పైసా ఖర్చుకు, ప్రతి మినహాయింపునకు సరైన రికార్డులు కలిగి ఉండటం ముఖ్యం.

ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement